Bhola Shankar: ‘భోళా శంకర్‌’ విషయంలో అదే ప్రమాదకరంగా మారింది..

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) చిత్రాన్ని పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు.

Updated : 07 Oct 2023 11:46 IST

హైదరాబాద్‌: మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). ఆగస్టులో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. పరుచూరి పాఠాల్లో (Paruchuri Paatalu) భాగంగా ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘ఇది అన్నా చెల్లెళ్ల కథ కాదు. చెల్లెలు కాని అమ్మాయిని తన చెల్లిగా భావించి చేరదీసిన ఓ అన్న కథ. నిజానికి ఇది అద్భుతమైన పాయింట్‌. ఈ సినిమా మాతృక ‘వేదాళం’లో దీనికి ప్రేక్షకాదరణ బాగా దక్కి ఉంటుంది. కోల్‌కతా బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన సినిమాలపై ప్రాంతీయత బాగా ప్రభావం చూపుతుంది. ఇది మన ప్రాంతానికి చెందిన కథలా లేదు అనే భావన ప్రేక్షకులకు వచ్చినట్లైతే వాళ్లు సినిమాకు డిస్‌కనెక్ట్‌ అవుతారు. ‘భోళా శంకర్‌’ మొదట్లోనే ఇది కోల్‌కతా కథ అని చూపించారు. దీంతో ఇది మన కథ కాదనే భావన నాకు కలిగింది. తమిళ సినిమాలు రీమేక్‌ చేసినా మన ప్రాంతీయతకు తగ్గట్లు వాటిలో మార్పులు చేయాలి. కానీ, ఈ చిత్రబృందం అలా ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు’’

‘‘ఈ సినిమా ప్రధానంగా మాన‌వ అక్ర‌మ ర‌వాణాను అంతం చేసిన హీరో కథ. గతంలో అన్నా చెల్లి సెంటిమెంట్‌ మీద రక్తసంబంధం, ఆడపడుచు.. ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సెంటిమెంట్‌తో వచ్చే కథల రూట్‌ మ్యాప్‌ వేరుగా ఉంటుంది. కానీ, ‘భోళా శంకర్‌’లో ఒకవైపు మాఫియాను అణచివేసే హీరోను చూపిస్తూనే.. మరోవైపు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ను చూపించారు. దీంతో రెండు పడవల మీద ప్రయాణం చేశారా అనే అనుమానం కలిగింది. దాన్ని తెలివిగా చూపించొచ్చు. మొదటి భాగమంతా హత్యలు చూపించి.. రెండో భాగంలో వాటిని ఎందుకు చేశారో చెబితే జనాలకు అర్థం కాదు’’ 

రివ్యూ: ఖూఫియా.. టబు నటించిన స్పై థ్రిల్లర్‌ సినిమా ఎలా ఉందంటే?

‘‘గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ’లో కథ ముందు చెప్పేసి ఆ తర్వాత ఆయన పగ తీర్చుకోవడం కోసం హత్య చేయడం చూపించారు. అలా చూపిస్తే జనాలకు నచ్చుతుంది. హత్య అనేది చాలా ప్రమాదకరమైన ఇన్సిడెంట్‌. దాన్ని ఎందుకు చేస్తున్నారు?వెనుక ఉన్న కారణం? ఇలాంటివి ప్రేక్షకులకు ముందే చెప్పాలి. కానీ, ‘భోళా శంకర్‌’లో చిరంజీవి లాంటి అగ్ర హీరోతో సినిమా ప్రారంభంలోనే వరుసగా హత్యలు చేస్తున్నట్లు చూపిస్తే నేను ఉలిక్కిపడ్డా. ఆ తర్వాత చిరంజీవిని తమన్నా ద్వేషిస్తూ ఉంటుంది. ఆ పాయింట్‌ జనాలకు ఎక్కదు. ఎందుకంటే చిరంజీవి లాంటి హీరోపై అమ్మాయి అంతలా కోపం పెంచుకుంటే.. ప్రేక్షకులకు ఆ పాత్ర నచ్చదు. ఈ అంశమే ఈ సినిమాకు అతి ప్రమాదకరంగా మారింది. అలాంటి అమ్మాయికి సెకండ్‌ ఆఫ్‌లో తన ఫ్లాష్‌ బ్యాక్‌ చెబుతాడు’’

‘‘చిరంజీవి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో మేము ఆయనతో పనిచేసినప్పుడు కూడా అన్ని అంశాలను క్షుణ్ణంగా  పరిశీలించేవారు. అనవసరమైన వాటిని కట్‌ చేసేవారు. ఇక చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ ‘భోళా శంకర్‌’ కథకు సరిపోలేదు. మొదటి భాగంలో అద్భుతమైన హీరోయిజాన్ని చూపి.. రెండో భాగంలో ఇల్లు ఖాళీ చేయించడం, మంచి వ్యక్తి కూతురుకు అన్యాయం చేయాలని చూడడం.. ఇలా చూపించేసరికి ప్రేక్షకులు ఈ సినిమాకు డిస్‌ కనెక్ట్‌ అయ్యారు’’

‘‘ఇందులో చిరంజీవికి తగ్గట్టుగా శ్రీముఖి లాంటి అమ్మాయిని కాకుండా మరో హీరోయిన్‌ పెట్టి ఆమెతో ప్రేమలో ఉన్నట్లు ఆమెకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేసినట్లు చూపిస్తే బాగుండేది. అసలు ఈ కథను తిప్పి చూపించాల్సిన అవసరం లేదు. యథాతథంగా కథను నడిపిస్తూ.. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ను అంతం చేసే హీరోగా చూపించినట్లైతే అద్భుతంగా ఉండేది. అప్పుడు ఈ సినిమా ఇంకా బెటర్‌గా ఆడేదేమో అని నాకు అనిపించింది’’ అని పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని