Pawankalyan: పవన్‌ పార్టీలో స్టెప్పులేసిన డైరెక్టర్‌.. సునీల్‌ కామెంట్‌ వైరల్‌

తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లానాయక్‌’ మేనియా కొనసాగుతోంది. పవర్‌స్టార్‌ నుంచి అభిమానులు ఎలాంటి ఎలివేషన్స్‌ కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు ఈచిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.....

Published : 28 Feb 2022 11:25 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లానాయక్‌’ మేనియా కొనసాగుతోంది. పవర్‌స్టార్‌ నుంచి అభిమానులు ఎలాంటి ఎలివేషన్స్‌ కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు ఈచిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా సక్సెస్‌ని పురస్కరించుకుని పవన్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శనివారం రాత్రి బిగ్గెస్ట్‌ వీకెండ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్‌గా మారగా.. తాజాగా మరికొన్ని ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పవన్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. గురూజీ ఫుల్‌ ఖుష్‌..!

‘భీమ్లానాయక్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ప్రముఖ దర్శకుడు, పవన్‌కు అత్యంత సన్నిహితుడు, ‘భీమ్లానాయక్‌’ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దగ్గరుండి చూసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పవన్‌ ఎంట్రీని కాస్త స్పెషల్‌గా ఏర్పాటు చేశారాయన. పార్టీ జరిగే ప్రాంతంలోకి పవన్‌ ఎంట్రీ ఇవ్వగానే.. దారికి ఇరువైపులా టపాసులు పెట్టారు. ఆ వెలుగుల నుంచి పవన్‌ నడుచుకుంటూ వెళ్లి.. త్రివిక్రమ్‌ని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు.

పార్టీలో స్టెప్పులేసిన దర్శకుడు..!

దర్శకుడు సాగర్‌ కె.చంద్ర మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నారు. తన సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు పార్టీలో ‘లాలా భీమ్లా’ పాటకు కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఆయన వేసిన స్టెప్పులు చూసి త్రివిక్రమ్‌ నవ్వులు పూయించారు. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

హిట్స్‌ ఇచ్చారు.. ఇవ్వనున్నారు..!

మూడేళ్ల విరామం అనంతరం ‘వకీల్‌సాబ్‌’తో మొదలైన తన హిట్‌ కౌంట్‌ని ఈ సినిమాతో కొనసాగించారు పవన్‌. ఇప్పుడు ఆయన ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో, తాజాగా జరిగిన వీకెండ్‌ పార్టీలో కేవలం ‘భీమ్లానాయక్‌’ టీమ్ మాత్రమే కాకుండా పవన్‌ తదుపరి చిత్రాల దర్శకులు కూడా తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రిష్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. ‘హిట్స్‌ ఇచ్చారు.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

పవన్‌ని హగ్‌ చేసుకున్న హైపర్‌ ఆది..

 సాధారణంగా హీరో అంటే కేవలం మెయిన్‌ టీమ్‌తోనే ఫొటోలు దిగేందుకు ఇష్టం చూపిస్తుంటారు. కానీ పవన్‌ మాత్రం టీమ్‌లో పనిచేసిన.. చాలా మందితో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఫొటోలు దిగారు. ముఖ్యంగా హైపర్‌ ఆది.. పవన్‌ని హగ్‌ చేసుకుని దిగిన ఫొటోలు ఇప్పుడు అంతటా వైరల్‌ అయ్యాయి.

స్క్రీన్‌ మాత్రమే కాదు.. స్టూల్‌ కూడా..!

‘భీమ్లానాయక్‌’ చిత్రంలో నటుడు సునీల్‌ ఓ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్‌గా ఆయన చేసిన రోల్‌, ‘భీమ్లానాయక్‌’ టైటిల్‌ సాంగ్‌కి పవన్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ఆయన షేర్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాంగ్‌ షూట్‌ జరుగుతున్న సమయంలో పవన్‌కల్యాణ్‌తో కలిసి ఫొటో తీసుకున్న ఆయన.. ‘‘ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నానని మాత్రమే మీకు తెలుసు.. కానీ స్టూల్‌ కూడా షేర్‌ చేసుకున్నాననే విషయం మీకు తెలియదు. పవన్‌ని ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటా’’ అని సునీల్‌ రాసుకొచ్చారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు