Radhe Shyam: 2018 మే 29 టు 2022 మార్చి 11.. ‘రాధేశ్యామ్‌’ ప్రయాణమిదీ!

పోరాటాలు చేసే ప్రభాస్‌ను ఎంతమంది ఇష్టపడతారో రొమాంటిక్‌గా కనిపించే ప్రభాస్‌ను అంతకన్నా ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. సుమారు దశాబ్దం తర్వాత  క్లాస్‌ లుక్‌లో, హస్తసాముద్రికా నిపుణుడిగా సందడి చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Published : 10 Mar 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోరాటాలు చేసే ప్రభాస్‌ను ఎంతమంది ఇష్టపడతారో రొమాంటిక్‌గా కనిపించే ప్రభాస్‌ను అంతకన్నా ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. సుమారు దశాబ్దం తర్వాత క్లాస్‌ లుక్‌లో, హస్తసాముద్రికా నిపుణుడిగా సందడి చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ (Prabhas) నటించిన క్లాసీ చిత్రం ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam). పలుమార్లు కొవిడ్‌/లాక్‌డౌన్‌ సమస్యలు దాటుకొని ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రయాణం ఎలా సాగిందో ఓ సారి చూద్దాం..

ద్వితీయ యజ్ఞం..

దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్‌ చేసిన రెండో ప్రయత్నమిది. దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దగ్గర ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ‘జిల్‌’ సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా రూపొందించిన ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం 2015 మార్చి 27న విడుదలైంది. అన్ని కేంద్రాల్లోనూ హిట్‌టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర పరిశ్రమలో రాధాకృష్ణ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్టైలిష్‌ డైరెక్టర్‌ తదుపరి ప్రాజెక్టు ఎవరితో చేస్తాడా? అన్న ప్రశ్నకు 2018 మే 29న శుభంకార్డు పడింది. అదే రోజు ‘‘ఓ పే.. ద్ద ప్రాజెక్టులో పెద్ద స్టార్‌. సంబంధిత వివరాలు త్వరలోనే వస్తాయి’’ అని ట్వీట్‌ చేస్తూ #Prabhas20 అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇవ్వడంతో రాధాకృష్ణ.. ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నాడని అభిమానులు ఫిక్సయ్యారు. హీరోయిన్‌ ఎవరు, సంగీతం అందించేదెవరు, టైటిల్‌ ఏంటి, ఏ జానర్‌ కథ, బడ్జెట్‌ ఎంత? అంటూ మళ్లీ చర్చలు మొదలయ్యాయి.


సెప్టెంబరులో పూజ..

‘జిల్‌’ తర్వాత యూవీ క్రియేషన్స్‌ సంస్థలోనే రాధాకృష్ణ మరో సినిమాకు పనిచేయాలనుకున్నారు. దానిపై వర్కవుట్‌ చేస్తున్నప్పుడే.. 18 ఏళ్ల క్రితం అనుకున్న ఓ పాయింట్‌ మదిలో మెదిలింది. అప్పుడు వదిలేసిన ఈ కథ ముగింపును పూర్తి చేసి నిర్మాతలు, ప్రభాస్‌కు వినిపించారు. వ్యక్తిగతంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మని ప్రభాస్‌ ఈ కథలో నటించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. ఆయన నో చెప్పాలనుకున్న సమయంలో.. ఇంటర్వెల్‌ సీన్‌, ద్వితియార్థం ముగ్దుడ్ని చేశాయి. సినిమాకు పచ్చజండా ఊపాయి. 2018 సెప్టెంబరు 6న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ‘‘ఈ సినిమాని యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్నాయి. పూజాహెగ్డే కథానాయిక’’ అని రాధాకృష్ణ ప్రకటించారు. 2018 సెప్టెంబరు 20న యూరోప్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. 2020 డిసెంబరు 4న అలనాటి నటి భాగ్యశ్రీ ఈ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఓ కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారు.


అలా పాన్‌ ఇండియాగా..

‘బాహుబలి’ కంటే ముందే ప్రభాస్‌ ఈ కథను ఓకే చేశారు. ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలతో ఆయనకు అంతర్జాతీయంగా పేరురావడంతో ‘రాధేశ్యామ్‌’ను పాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించారు. ప్రభాస్‌ సలహా మేరకు ఈ చిత్ర కథను యూరోప్‌ నేపథ్యానికి తగ్గట్టుగా దర్శకుడు మార్పులు చేశారు. యూరప్‌కు చెందిన కీరో అనే ప్రముఖ హస్తసాముద్రికా నిపుణుడి స్ఫూర్తితో ప్రభాస్‌ పాత్రను తీర్చిదిద్దారు.


సర్‌ప్రైజ్‌లు అప్పుడే..

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌/ ప్రభాస్‌ ప్రీ లుక్‌ 2020 జనవరి 17న బయటకు వచ్చింది. ప్రభాస్‌ స్టాండింగ్‌ స్టైల్‌, ఆయన వెనక బ్యాక్‌గ్రౌండ్‌ అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఫస్ట్‌లుక్‌ 2020 జులై 10న విడుదలైంది. ప్రభాస్‌, పూజాహెగ్డే కెమిస్ట్రీ కట్టిపడేసింది. ఇదే రోజు టైటిల్‌ ‘రాధేశ్యామ్‌’ ఖరారైంది. విడుదలైన 24 గంటల్లో 6.3 మిలియన్‌కుపైగా ట్వీట్లు నమోదైన పోస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాలో పూజాహెగ్డే ‘ప్రేరణ’గా నటించింది. సంబంధిత లుక్‌ 2020 అక్టోబరు 13న వచ్చింది. ప్రభాస్‌ పోషించిన విక్రమాదిత్య లుక్‌ అక్టోబరు 21న ఒకటి, 2021 జనవరి 1న మరొకటి విడుదలయ్యాయి. సినిమా థీమ్‌ ఎలా ఉంటుందో చూపించే వీడియో (బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌) 2020 అక్టోబరు 23న విడుదలై, వావ్‌ అనిపించింది. 2021 ఫిబ్రవరి 14న టీజర్‌ అలరించింది. అక్టోబరు 23న విక్రమాదిత్య పాత్రకు సంబంధించిన టీజర్‌ వచ్చింది. ఈ సినిమాలోని తొలి గీతం ‘ఈ రాతలే’ నవంబరు 15న , రెండో పాట ‘నగుమోము తారలే’ డిసెంబరు 2న, మూడో గీతం ‘సంచారి’ డిసెంబరు 16న విడుదలయ్యాయి. ప్రభాస్‌ పెద్దనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఫస్ట్‌లుక్‌ డిసెంబరు 20న రిలీజ్‌ అయింది. ఇందులో ఆయన పరమహంస అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్‌ డిసెంబరు 23న విడుదలై, అనతి కాలంలోనే రికార్డు స్థాయి వ్యూస్‌ సాధించింది. ‘రిలీజ్‌ ట్రైలర్‌’ అంటూ మరో వీడియోను మార్చి 2న విడుదల చేశారు.


అరుదైన ప్రకటన..

ఫస్ట్‌లుక్స్‌, వీడియోలతో ఎన్నో అంచనాలు పెంచిన ఈ సినిమా సంగీత దర్శకుడి వివరాలను కొంతకాలం గోప్యంగా ఉంచారు. 2021 ఫిబ్రవరి 11న ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందించేది ఎవరో తెలిసింది. ఒక సినిమాకు ఇద్దరుముగ్గురు సంగీతం ఇవ్వడం చాలా అరుదు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ముగ్గురు సంగీతం అందించారు. దక్షిణాది భాషలకు (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం) జస్టిన్‌ ప్రభాకరన్‌, హిందీ వెర్షన్‌కు మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. హిందీ మినహా ఇతర వెర్షన్లకు తమన్‌ నేపథ్య సంగీతం అందించారు.


అక్కడ అమితాబ్‌.. ఇక్కడ రాజమౌళి

ఒక్కో భాషలో ఒక్కో స్టార్‌ ఈ సినిమా కథను ప్రేక్షకులకు వినిపించబోతున్నారు. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తే, తెలుగులో రాజమౌళి ఇచ్చారు. కన్నడంలో శివరాజ్‌కుమార్‌, తమిళంలో సత్యరాజ్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తమ గాత్రాన్ని అందించారు.


ఏం ఉంటాయి.. ఎవరెవరు కనిపిస్తారు

‘ఈ సినిమా ఏ జానర్‌లో సాగుతుంది?’ అనేది చాలా మందికి సందేహం. పోస్టర్లనుబట్టి కొందరు లవ్‌స్టోరీ అనుకుంటే, ట్రైలర్లు చూసిన మరికొందరు సైఫై (సైంటిఫిక్‌) చిత్రమని అభిప్రాయపడ్డారు. పిష్‌ ఎపిసోడ్‌ సీన్‌ చూసి ‘టైటానిక్‌’ సినిమాతో పోల్చారు. ‘‘ఈ సినిమాలో యాక్షన్‌ ఉంది కానీ ఫైట్లు లేవు. లవ్‌, థ్రిల్లింగ్‌ అంశాలున్నాయి కాబట్టి దీన్ని థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ’’ అనుకోవచ్చు అని ప్రభాస్‌ తెలిపారు. సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రంలో భాగ్యశ్రీ, కృష్ణంరాజుతోపాటు జగపతిబాబు, రిద్ది కుమార్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, మురళీశర్మ, ప్రియదర్శి, జయరామ్‌ తదితరులు కనిపిస్తారు. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే షిప్‌ ఎపిసోడ్‌ కోసం దాదాపు రెండేళ్లు శ్రమించారు. నిక్‌ పావెల్‌తోపాటు హాలీవుడ్‌ ప్రముఖ సాంకేతిక నిపుణులు కొందరు ఈ సన్నివేశం తెరకెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌, సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస ఈ సినిమా తెర వెనక హీరోలని ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


ఓ వైపు చలి.. మరోవైపు కరోనా

ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ యూరప్‌లోనే జరిగింది. షూటింగ్‌ సాగుతున్నప్పుడే కొవిడ్‌ విజృంభించింది. కరోనా వైరస్‌ భయం ఉన్నా, ఎముకలు కొరికే చలి పెడుతున్నా చిత్ర బృందం లెక్కచేయకుండా చిత్రీకరణను కొనసాగించింది. ఇటలీ, ఆస్ట్రియా, జార్జియా తదితర దేశాల్లో షూటింగ్‌ చేశారు. ఈ సినిమా కోసం వినియోగించిన బెడ్లను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి అందించి నిర్మాతలు తమ మంచి మనసును చాటుకున్నారు. విపత్కర సమయంలో ఎందరో కొవిడ్‌ బాధితులకు అవి ఉపయోగపడ్డాయి.


అట్టహాసంగా..

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రామోజీ ఫిలిం సిటీ వేదికగా కనుల పండగలా సాగింది. అభిమానులే అతిథులుగా నిర్వహించిన ఈ వేడుకలో యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి చేసిన కామెడీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ భారీ స్థాయి ఈవెంట్‌ 2021 డిసెంబరు 23న జరిగింది. అధునాతన టెక్నాలజీ ‘మెటావర్స్‌’లో ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రదర్శించడం విశేషం.


2019 చివర్లోనే రావాల్సింది..

ముందుగా ఈ సినిమాను 2019 చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, సాధ్యమవలేదు. ఆ తర్వాత 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. తర్వాత, 2021 జులై 30న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. సెకండ్‌ వేవ్‌ కారణంగా మరోసారి వాయిదా వేస్తూ 2022 జనవరి 14న విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ‘‘హమ్మయ్య ఎట్టకేలకు విడుదలవుతుంది. ప్రచారం కూడా పూర్తయింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవంతమైంది. మరికొన్ని రోజుల్లో వెండితెరపై ‘రాధేశ్యామ్‌’ను చూసేస్తాం’’ అని అనుకున్న చిత్ర బృందం, ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రియులకు నిరాశే ఎదురైంది. థర్డ్‌వేవ్‌ వల్ల ఈ చిత్రం పోస్ట్‌పోన్‌ అయింది.


ఏది గెలుస్తుంది..

మళ్లీ ఎప్పుడు విడుదలవుతుందా? అనే అభిమానుల ప్రశ్నకు చిత్ర బృందం ‘మార్చి 11న’ అని సమాధానమిచ్చింది. ఈ శుభవార్త తెలియడమే ఆలస్యం.. రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లు లెక్కపెట్టుకుంటూ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘ప్రేమకు, విధికి జరిగిన యుద్ధంలో ఏది గెలిచింది’ అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి ‘రాధేశ్యామ్‌’ చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని