Vijay: రాజకీయాల్లోకి విజయ్‌.. రజనీకాంత్‌ స్పందన ఇదే!

Vijay: విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో అగ్ర నటుడు రజనీకాంత్‌ తన స్పందన తెలియజేశారు.

Updated : 07 Feb 2024 18:12 IST

చెన్నై: ప్రముఖ సినీ నటుడు విజయ్‌ (Vijay) ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ నెలకొల్పుతున్నట్టు స్వయంగా ప్రకటించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై అగ్ర నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రజనీ మాట్లాడుతూ..  ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే, ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో ప్రాభవం తగ్గడం, ఇటీవల డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం) అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూయడంతో తమిళ రాజకీయాల్లో శూన్యం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు. అధికార డీఎంకేను సీఎం స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విజయ్‌ పార్టీని ప్రకటించి, తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పిన ఆయన, ఆ తర్వాత జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడతారని అన్నారు. మరో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ కూడా ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే.

పార్టీ చిహ్నంపై కసరత్తు

మరోవైపు విజయ్‌ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ  చిహ్నంపై కసరత్తు మొదలైంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా పార్టీ చిహ్నం ఉండేలా సూచించాలని  ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ అభిమాన సంఘాల నిర్వాహకులతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ పేరును రిజిస్టర్‌ చేసిన సమయంలో 5 చిహ్నాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశారని, అందులో మహిళలను ఆకట్టుకొనే విధంగా గుర్తు ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని