Ram Charan: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు బ్రేక్‌ తీసుకుందాం అనుకున్నా: రామ్‌చరణ్‌

తన సినీ కెరీర్‌ గురించి రామ్‌చరణ్‌ (Ram Charan) ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)కు ముందు తాను విరామం తీసుకోవాలనుకున్నట్లు చెప్పారు.

Published : 05 Mar 2023 01:35 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు తాను సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోవాలనుకున్నట్లు నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) తెలిపారు. కొత్తగా ఏదైనా నేర్చుకుని తాను తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టాలనుకున్న సమయంలో రాజమౌళి (Rajamouli) నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆఫర్‌ వచ్చిందని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ‘‘మగధీర’కు నేనొక స్టూడెంట్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా స్టూడెంట్‌నే. రాజమౌళి నాకు ప్రిన్సిపల్‌, టీచర్‌, గురు అని సరదాగా చెప్పడం లేదు. ఆయన్ని కలిసిన ప్రతిసారీ నటన గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. దీనిని నేను రానున్న పదేళ్ల పాటు ఉపయోగించుకుంటాను. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు అయినప్పటికీ.. కాస్త బ్రేక్‌ తీసుకుని.. కొత్తగా ఏదైనా నేర్చుకుని తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టాలని గతంలో అనుకున్నాను. అలాంటి సమయంలో రాజమౌళి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆఫర్‌ వచ్చింది. రాజమౌళి కాలేజీకి ఒక స్టూడెంట్‌గా అడుగుపెట్టాను. నటుడిగా కాదు ఒక స్టూడెంట్‌గా ఆయన సినిమాల్లో భాగమైనందుకు ఆనందిస్తున్నా’’ అని చరణ్‌ తెలిపారు.

అనంతరం ఆయన తారక్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ఎప్పటి నుంచో స్నేహితులం. మాట్లాడుకునేవాళ్లం. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఎన్టీఆర్‌ నేనూ ఇన్నేళ్ల నుంచి సరిగ్గా కలవలేకపోయాం. కానీ, ఈ సినిమా మమ్మల్ని మరింత చేరువ చేసింది. మా ఇద్దర్నీ హీరోలుగా పెట్టాలని జక్కన్నకు అనిపించినందుకు ధన్యవాదాలు. తారక్‌ ఉండటం వల్ల సోదరభావం చూపించడం నాకింకా సులభమైంది. ఈ కార్యక్రమంలో తారక్‌ను ఎంతగానో మిస్‌ అవుతున్నా. తనకు వేరే పనులు ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. తారక్‌.. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని