Rangabali: వంగవీటి రంగా స్ఫూర్తితో హీరో పాత్ర.. నాగశౌర్య రియాక్షన్‌ ఏంటంటే?

మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా స్ఫూర్తితో ‘రంగబలి’ సినిమాలోని హీరో పాత్ర రూపొందిందా? అనే ప్రశ్నపై నటుడు నాగశౌర్య స్పందించారు. ఆయన హీరోగా దర్శకుడు పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించిన చిత్రమిది.

Published : 27 Jun 2023 23:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య (Naga Shaurya) హీరోగా దర్శకుడు పవన్‌ బాసంశెట్టి (Pawan Basamsetti) తెరకెక్కించిన చిత్రం.. ‘రంగబలి’ (Rangabali). యుక్తి తరేజా (YuktiThareja) కథానాయిక. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని ‘ఏఏఏ సినిమాస్‌’ (AAA Cinemas)లో ట్రైలర్‌ని విడుదల చేసింది. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

* రెండు హిట్‌ చిత్రాల టైటిల్స్‌తో ‘రంగబలి’ అని పెట్టారా?

పవన్‌: ఈ సినిమా టైటిల్‌ని ఆ కోణంలో పెట్టలేదు. రంగబలి అనే సెంటర్‌ చుట్టూ అల్లుకథ ఇది. దాంతో, ఆ పేరు అయితేనే బాగుంటుందని ఎంపిక చేశాం. అందులో ‘రంగస్థలం’, ‘బాహుబలి’ పేర్లు కలిశాయి.

* టైటిల్‌ చూసిన చాలా మంది ఇదొక పీరియాడికల్‌ చిత్రమనుకున్నారు. కానీ, టీజర్‌, ట్రైలర్‌ ఆ నేపథ్యం కాదని తెలియజేస్తున్నాయి. దీని గురించి ఏమంటారు?

పవన్‌: ఆసక్తిగా ఉంది కదా అని టైటిల్‌ని పెట్టలేం. కథకు ఏది సెట్‌ అవుతుందో అదే పెడతాం. రంగబలి నేపథ్య సినిమా కాబట్టి అదే పేరును పెట్టాం. అంచనాల కోసం కాదు.

* ఇందులోని హీరో పాత్ర వంగవీటి రంగా స్ఫూర్తితో రూపొందినట్టుగా అనిపిస్తోంది!

నాగశౌర్య: కాదండీ (నవ్వుతూ). ఇదొక ఊరిలోని సెంటర్‌ చుట్టూ తిరిగే స్టోరీ. ఇది ఏ వ్యక్తికీ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు చోటుచేసుకున్న సంఘటనలకూ సంబంధించింది కాదు.

* ప్రేక్షకుల్లో మీకు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. ట్రైలర్‌లో చూస్తే అసభ్యకరమైన డైలాగ్‌ ఒకటి వినిపించింది. అది అవసరమంటారా?

నాగశౌర్య: నాకు కావాలనుకుంటే నా గత చిత్రాల్లోనే అలాంటి సంభాషణలు పెట్టొచ్చు. నా నుంచి దర్శకుడు ఏం కోరుకున్నాడో అలానే నేను నటించా. నేను చెయ్యను అంటే ఎలా? అయినా ఎవరికి కోపమొచ్చినా తిడతారేగానీ పాటలు పాడతారా?

* గేయ రచయిత అనంత శ్రీరామ్‌ని నటుడిగా మార్చడానికి కారణం?

పవన్‌: ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్‌ ఉత్సాహం చూసి ముచ్చటేసింది. నా సినిమాలో ఆయనకు ఓ క్యారెక్టర్‌ రాస్తే బాగుంటుందనిపించింది. ఆయన్ను కలిసి నా మనసులో మాట చెప్పగానే అంగీకరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని