మా నాన్న నన్ను చంపాలనుకున్నాడు..: ‘రేసుగుర్రం’ విలన్‌

తన తండ్రి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయానని నటుడు రవికిషన్‌ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో కెరీర్‌ ఎలా మొదలైందో గుర్తు చేసుకున్నారు.

Published : 16 Mar 2024 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రేసుగుర్రం’తో తెలుగువారికి సుపరిచితమైన నటుడు రవి కిషన్‌ (Ravi Kishan). ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ వరుస చిత్రాలు చేస్తోన్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటుడిగా తన కెరీర్‌ ఎలా మొదలైందో తెలిపారు. తన తండ్రి కారణంగా 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వచ్చానన్నారు.

‘‘మా నాన్నకు భావోద్వేగాలు చాలా తక్కువ. నన్ను దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. ఒకానొక సమయంలో ఆయన నన్ను చంపాలనుకున్నాడు. ఆ విషయం అమ్మకు అర్థమై పారిపొమ్మని చెప్పింది. రూ.ఐదు వందలతో ఇంటి నుంచి వచ్చేశా. ట్రైన్‌ ఎక్కి ముంబయి చేరుకున్నా. మా నాన్న కోపంలో అర్థముంది. మాది సంప్రదాయ కుటుంబం. వ్యవసాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయమన్నారు. తన కుటుంబంలో ఒక నటుడు పుడతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో ఇంటి దగ్గర ‘రామ్‌లీలా’ నాటకం వేయగా సీతగా నటించా. అది చూసి ఆయన షాక్ అయ్యారు. నన్ను బాగా కొట్టారు’’ అని రవికిషన్‌ తెలిపారు.

కెరీర్‌ ఆరంభంలో రవికిషన్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ నటుడిగా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. ‘‘ఈ భూమ్మీద నుంచి వెళ్లేటప్పుడు మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చిన్నతనంలోనే ఫిక్స్‌ అయ్యా. ఆ ఆశతోనే నటుడిగా మారా. చిన్నతనంలో నన్ను బాగా కొట్టినందుకు చివరి రోజుల్లో నాన్న బాధపడ్డారు. ‘నువ్వే మాకు గర్వకారణం’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని చెప్పారు. రవికిషన్‌.. హిందీతోపాటు భోజ్‌పురి, తెలుగు, మరాఠి, కన్నడ చిత్రాల్లో నటించారు. ‘రేసుగుర్రం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ‘కిక్‌ 2’, ‘సుప్రీమ్‌’, ‘రాధ’, ‘లై’, ‘సాక్ష్యం’, ‘గద్దలకొండ గణేశ్‌’, ‘90 ఎం.ఎల్‌’, ‘సైరా’ వంటి సినిమాల్లో కీలకపాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని