అదే టైటిల్‌ పదే పదే!

మనిషికి పేరు ఎంత ముఖ్యమో సినిమాకు టైటిల్‌ అంతే ముఖ్యం. ఒక పేరే చాలామంది వ్యక్తులకు ఉన్నట్టు కొన్ని చిత్రాలకూ ఒకే పేరు ఉంటుంది. కథకు సరిగ్గా సరిపోయే పేరు

Updated : 10 Mar 2021 09:19 IST

మనిషికి పేరు ఎంత ముఖ్యమో సినిమాకు టైటిల్‌ అంతే ముఖ్యం. ఒక పేరే చాలామంది వ్యక్తులకు ఉన్నట్టు కొన్ని చిత్రాలకూ ఒకే పేరు ఉంటుంది. కథకు సరిగ్గా సరిపోయే పేరు పెట్టాలంటే ఇలా చేయక తప్పదు మరి! అందుకే గతంలో వెండితెరపై సందడి చేసిన పేరే మరోసారి మెరుస్తుంటుంది. అప్పుడప్పుడు మూడు సినిమాలకు ఒకే టైటిల్‌ పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. మార్చి 11న విడుదలవుతున్న ‘శ్రీకారం’ చిత్రం  ఈ కోవలోకే వస్తోంది.  ఈ సందర్భంగా అలా వచ్చిన, రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం..

శర్వానంద్‌, ప్రియాంక అరుళ్ మోహన్‌ జంటగా బి.కిశోర్ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీకారం’. వ్యవసాయం గొప్పతనాన్ని చాటి చెప్పే కథ ఇది. కొత్త ఒరవడికి నాంది కావడంతో శ్రీకారం అనే పెట్టారు. ఇదే పేరుతో 1996లో జగపతి బాబు హీరోగా ఓ చిత్రం వచ్చింది. 


 

ఇప్పటి యువతకు ‘మహర్షి’ అంటే మహేశ్‌ బాబు గుర్తుకొస్తారు. అంతగా తన మేనియా చూపించారాయన. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి స్ఫూర్తినిచ్చింది. ఇదే పేరుతో అప్పటి యువతను అమితంగా ఆకట్టుకున్నారు రాఘవ. 1987లో విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ పేరే ఇంటి పేరైంది రాఘవకు.


గ్యాంగ్‌ లీడర్‌

‘గ్యాంగ్‌ లీడర్‌’గా 1991లో సంచలనం సృష్టించారు చిరంజీవి. ఇదే టైటిల్‌తో నాని ఓ గ్యాంగ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. కొంచెం మార్పు చేసి ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’గా నామకరణం చేశారు. 


 

 

‘గుణ’ అనే పేరుతో 1991లో ఓ చిత్రంలో నటించారు కమల్ హాసన్‌. ‘ప్రియతమా నీవచట కుశలమా’ హిట్‌ గీతం ఈ సినిమాలోదే. ఇదే పేరుకి 369 సంఖ్య జతచేర్చి ‘గుణ 369’గా వచ్చాడు కార్తికేయ.


రాక్షసుడు

1986లో చిరంజీవి హీరోగా ‘రాక్షసుడు’ విడుదలైంది. 2015లో సూర్య నటించిన తమిళ చిత్రం (మస్సు ఎంగిర మసిలమని) ఇదే పేరుతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ముచ్చటగా మూడోసారి ఈ పేరును ఎంపిక చేసుకున్నారు బెల్లకొండ శ్రీనివాస్‌. అనుపమ పరమేశ్వరన్‌ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని రమేశ్‌ వర్మ తెరకెక్కించారు.


1953లో ‘దేవదాసు’ చిత్రంలో నటించి ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చారు అక్కినేని నాగేశ్వరరావు. నేనూ ‘దేవదాసు’నే అంటూ 2016లో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు రామ్‌ పోతినేని. ఇవి రెండు ప్రేమ కథలైతే ఇదే పేరుతో నవ్వులు పంచారు నాగార్జున, నాని. ఒకరు దేవ, మరొకరు దాస్‌గా ‘దేవదాస్‌’లో సందడి చేశారు. 


1998లో తన ‘తొలిప్రేమ’ను పరిచయం చేశారు పవన్‌ కల్యాణ్‌. ఇటీవలే వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ కథ చెప్పాడు.


నందమూరి తారక రామారావు నటించిన సూపట్‌ హిట్‌ చిత్రాల్లో ‘అడవి రాముడు’ ఒకటి. 1977లో విడుదలైందా సినిమా. ఆ తర్వాత ప్రభాస్‌ హీరోగా మరో ‘అడవి రాముడు’ తెరకెక్కింది. రెండూ అడవి నేపథ్యంలో సాగే కథలే.


ఎన్టీఆర్‌, కృష్ణ కథానాయకులుగా ‘దేవుడు చేసిన మనుషులు’ 1973లో తెరకెక్కింది. ఇదే పేరుతో రవితేజ ఓ చిత్రాన్ని విడుదల చేశారు.


ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, సావిత్రి ప్రధాన పాత్రల్లో 1955లో ‘మిస్సమ్మ’ చిత్రం విడుదలైంది. ఇదే పేరుతో శివాజీ, భూమిక జంటగా ఓ సినిమా తెరకెక్కింది.


‘అహనా-పెళ్లంట!’.. ఈ పేరు తలుచుకుంటేనే నవ్వొచ్చేస్తుంది సినీ ప్రియులకు. రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా 1987లో విడుదలైందీ సినిమా. ఇదే టైటిల్‌తో అలాంటి కామెడీనే అందించాడు అల్లరి నరేశ్‌.


1973లో ‘అందాల రాముడు’ చిత్రంతో అలరించారు అక్కినేని నాగేశ్వరరావు. నేను కూడా అంటూ సునీల్‌ ఇదే పేరు పెట్టుకున్నారు.


- వీటి సంగతి ఇలా ఉంటే.. మరికొన్ని చిత్రాలు ఉన్న పేరుతోటే కొన్ని పదాల తేడాతో వచ్చాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు