Cinema News: జ్ఞాపకాలు చెరిపేస్తే... ప్రేమ చెదిరిపోతుందా?

ప్రేమలో తీపి గురుతులుంటాయి. గుండెలోతుల్లోకి దిగే గాయాలూ ఉంటాయి. ప్రేమ విఫలమైతే ఆ జ్ఞాపకాలు మనసులో అగ్నిపర్వతాల్లో కొన్నేళ్లపాటు మండుతూనే ఉంటాయి. ఇంత వేదనను భరించకుండా....

Updated : 06 Jun 2021 09:55 IST

ప్రేక్షకాలమ్‌..

చిత్రం: ఎటర్నల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ ది స్పాట్‌లెస్‌ మైండ్‌; భాష: ఇంగ్లీష్; దర్శకుడు: మిచెల్‌ గాండ్రీ; స్క్రీన్‌ప్లే: చార్లీ కఫ్‌మ్యాన్; విడుదల: 2004; తారాగణం: జిమ్‌ క్యారీ, కేట్‌ విన్‌స్లెట్, మార్క్‌ రఫెలో తదితరులు; నిడివి: 108 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు:నెట్‌ఫ్లిక్స్‌

ప్రేమలో తీపి గురుతులుంటాయి. గుండెలోతుల్లోకి దిగే గాయాలూ ఉంటాయి. ప్రేమ విఫలమైతే ఆ జ్ఞాపకాలు మనసులో అగ్నిపర్వతాల్లో కొన్నేళ్లపాటు మండుతూనే ఉంటాయి. ఇంత వేదనను భరించకుండా ఈ జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపేయగలిగే శక్తి ఉంటే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే కథాంశంతో తెరకెక్కింది ‘ఎటర్నల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ ది స్పాట్‌లెస్‌ మైండ్‌’. జోయెల్, క్లెమెంటైన్‌ అనే ప్రేమికులు ఒకరితో ఒకరు  గడిపిన కాలాన్ని, పొందిన అనుభవాలను, విషాద క్షణాలను ఇలా ప్రతి గురుతును తొలగించుకుంటారు. గత జ్ఞాపకాలను అయితే తుడిచేసుకున్నారు సరే మరి హృదయంలోంచి శాశ్వతంగా దూరమయ్యారా? లేదా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

హాలీవుడ్‌లో అపూర్వమైన ప్రేమకథా చిత్రంగా విశ్లేషకుల మన్ననలు పొందిన ఈ సినిమాను మిచెల్‌ గాండ్రీ తెరకెక్కించాడు. ‘బీయింగ్‌ జాన్‌ మాల్కోవిచ్‌’, ‘అడాప్షన్‌’ లాంటి  అరుదైన చిత్రాలకు కథనందించిన చార్లీ కఫ్‌మ్యాన్‌ దీనికీ కథ, స్క్రీన్‌ప్లేలను రాశారు. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలు జోడించి నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో సరికొత్త ప్రేమకథను రూపొందించారు. ‘ది మాస్క్‌’, ‘డంబ్‌ అండ్‌ డంబర్‌’ లాంటి చిత్రాల్లో నటించిన జిమ్‌ క్యారీ ఇందులో భగ్నప్రేమికుడిగా సిరీయస్‌ రోల్‌ని పోషించడం విశేషం. టైటానిక్‌ సుందరి కేట్‌  విన్‌స్లెట్‌ జిమ్‌కు ప్రేయసిగా నటించింది. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్నే సొంతం చేసుకుంది. బడ్జెట్‌కు నాలుగురెట్ల వసూళ్ల సాధించిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఉత్తమ స్క్రీన్‌ ప్లే విభాగంలో చార్లీ కఫ్‌మ్యాన్‌ ఆస్కార్‌ గెలుచుకున్నారు.

కథ: క్లెమంటైన్‌(కేట్‌ విన్‌స్లెట్‌), జోయెల్‌(జిమ్‌ క్యారీ) ప్రేమికులు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోతారు. క్లెమెంటైన్‌ ఓ డాక్టర్‌ను సంప్రదించి జోయెల్‌తో పాటు అతని జ్ఞాపకాలన్నింటినీ శాశ్వతంగా చెరిపేసుకుంటుంది. జోయెల్‌కు కనిపించినా తానెవరో గుర్తుపట్టదు. తన జ్ఞాపకాలన్నింటినీ చెరిపేసుకుందని తెలుసుకొని తీవ్రంగా కుంగిపోతాడు జోయెల్‌. ఆయనా అదే పద్ధతిలో క్లెమంటైన్‌ను పూర్తిగా మనుసులోంచి తుడిచేయాలని నిర్ణయానికొచ్చి డాక్టర్‌ను సంప్రదిస్తాడు.  జోయెల్‌ నిద్రలోకి జారుకున్నాక పాట్రిక్‌ అనే వైద్యుడు ఈ ప్రక్రియను ప్రారంభిస్తాడు. జోయెల్‌ నిద్రలేచే లోపు ఆ క్లెమంటైన్‌ను, ఆమె గురుతులను పూర్తిగా తుడిచేయాలి. ముందుగా   ప్రేమికులిద్దరూ చివరి సారి గొడవ పడిన చోట మొదలుపెట్టి ఒక్కో జ్ఞాపకాన్ని చెరిపేసుకుంటూ వెనక్కి వెళ్తాడు పాట్రిక్‌. ఇలా వెనక్కి వెళ్లే క్రమంలో వారిద్దరి మధ్యనుండే మధుర క్షణాలూ చెరిగిపోతూ ఉంటాయి. ఇది జోయెల్‌కు నచ్చదు.  క్లైమెంటైన్‌ను అలా శాశ్వతంగా తుడిచేయకుండా ఈ ప్రక్రియను ఆపాలనుకుంటాడు. నిద్రలో జోయెల్‌ మెదడులో ఈ కథంతా తిరుగుతూ ఉంటుంది. బయటకు అరిచి చెప్పలేడు. దాన్ని ఆపలేడు. ఇలా సందిగ్ధావస్థలో పడిపోతాడు హీరో. మరి జోయెల్‌ మనసులోంచి క్లెమెంటైన్‌ గురుతులను పూర్తిగా తొలగించారా? హీరో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడా? ప్రేమికులిద్దరూ తిరిగి కలుసుకున్నారా లేదా? అన్నది మిగతా కథ.

జుట్టు... స్క్రీన్‌ప్లే గుట్టు

కథలో హీరోయిన్‌ కేశాల రంగుకు స్క్రీన్‌ప్లేలో ప్రాధాన్యం ఉంటుంది. జోయెల్‌తో మారే అనుబంధంతో పాటే క్లెమెంటైన్‌ తల వెంట్రుకల రంగు మారుతూ వస్తుంది. అలాగే కాలాలను ఈ రంగులు ప్రతిబింబిస్తాయి. వారిద్దరూ వసంతంలో తొలిసారి కలుసుకున్నప్పుడు ఆకుపచ్చ రంగు కేశాలతో కనిపిస్తుంది హీరోయిన్‌. ప్రేమ చిగురిస్తుందని చెప్పడానికి సంకేతమిది. అలాగే వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నప్పుడు ఎరుపు రంగు, ప్రేమ పలుచబడుతున్నప్పుడు కేశాలు నారింజ రంగులో కనిపిస్తాయి. అలాగే తిరిగి రెండో సారి కలుసుకున్నప్పుడు ఆమె జుట్టు నీలం రంగులో కనిపిస్తుంది. ఇలా హీరోయిన్‌ కేశాల రంగు సినిమా కథను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.

సినిమా మొదటి నుంచి నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేలో నడుస్తుంది. జోయెల్‌ మెదడులో  జ్ఞాపకాలను చెరిపేసే ప్రక్రియ బయట జరుగుతుంటే, నిద్రలో జోయెల్‌ మెదడులో మరో కథ తిరుగుతుంటుంది. అలాగే బయట మళ్లీ కలుసుకున్నాక జరిగే కథ.. ఇలా మూడు కథలు సమాంతరంగా సాగి ప్రేక్షకుడికి కొంత గందరగోళంగా అనిపించినా.. సినిమా ముగిసే సరికి మంచి అనుభూతినిస్తుంది. ఇలా ఓ చిక్కుముడిలా స్క్రీన్‌ప్లే రాసుకొని ఓ మామూలు కథను అసాధారణంగా మార్చాడు రచయిత చార్లీ కఫ్‌మ్యాన్‌.

క్లెమెంటైన్‌కు అందంగా ఉండననే ఆత్మన్యూనతతో పాటు ఆవేశం, తొందరపాటు ఎక్కువ. జోయెల్‌కు అభద్రతా భావం. వీటివల్లే ఇద్దరూ గొడవపడి విడిపోతారు. ఇలాంటి లోపాలేవీ జంటగా బతికేందుకు అడ్డుకావని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకే మెదడులోంచి శాశ్వతంగా ఒకరినొకరు చెరిపేసుకున్నా చివర్లో మళ్లీ వారిద్దరినీ జంటగా కలుపుతాడు. ప్రేమ... పుడుతుందే తప్ప చావదు. ప్రేమ అజరామరం అని చెప్పకనే చెబుతాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని