జన్మలో దర్శకుడివి కాలేవ్‌ అన్నారు: సుజిత్‌

దర్శకుడు సుజిత్‌, నటుడు అడివి శేష్‌ ‘నీకు మాత్రమే చెప్తా’ కార్యక్రమంలో పంచుకున్న విశేషాలు..

Published : 06 Jul 2021 09:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. చులకనగా చూసిన వారితోనే శెభాష్‌ అనిపించుకున్నాడు. రెండో సినిమానే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించి దర్శకుడిగా సత్తా చాటాడు. ఆయనెవరో కాదు ‘సాహో’ సుజిత్‌. ‘ఈటీవీ ప్లస్‌’లో ప్రతి శనివారం ప్రసారయ్యే ‘నీకు మాత్రమే చెప్తా’ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోకి సుజిత్‌తోపాటు నటుడు అడివి శేష్‌ హాజరై సందడి చేశారు. ఆ విశేషాలివీ...

మీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యం?

సుజిత్‌: అదేంటంటే.. హీరో అవుదామని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టా. ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆడిషన్స్‌కి వెళ్లేవాణ్ని. అక్కడ నన్ను చూసినవాళ్లంతా ‘ఏదో ఉంది కానీ ఏం లేదు’ అనేవారు (నవ్వులు). అలా అన్న వాళ్లకి నేనేంటో చూపించాలని సీరియస్‌గా దర్శకత్వం వైపు అడుగేశా. నేను బ్యాడ్‌ యాక్టర్‌ని‌, గుడ్‌ డైరెక్టర్‌ని అని స్వీయ దర్శకత్వంలో (లఘు చిత్రాలు) నటించినప్పుడు తెలిసింది.

రెండో చిత్రాన్నే (సాహో) పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు కదా. ఎలాంటి ఒత్తిడి ఉండేది?

సుజిత్‌: నా తొలి చిత్రం ‘రన్‌ రాజా రన్‌’కి ముందు నుంచే ప్రభాస్‌తో పరిచయం ఉంది. నేను తీసిన ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ అనే లఘుచిత్రం ప్రభాస్‌కి బాగా నచ్చడంతో నన్ను ప్రోత్సహించారు. ‘రన్‌ రాజా’ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నాకు పరిచయమవడానికి ఓ రకంగా ప్రభాసే కారణం. అలా అని ఆయనతో సినిమా చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ‘రన్‌ రాజా రన్‌’ విడుదలయ్యాక ఓ సారి ప్రభాస్‌ని కలిసినపుడు ‘సినిమా చాలా బాగుంది.. మనం ఓ చిత్రం చేద్దాం’ అని అన్నారు. ఆ సమయంలో ఓకే అనేశాను. కానీ, సీరియస్‌గా తీసుకోలేదు. నేను మాటిచ్చిన కొంతకాలానికి ప్రభాస్‌ కొత్త కథల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తమిళ దర్శకులు కొందరు తమ స్క్రిప్టుల్ని ప్రభాస్‌ బృందానికి వినిపించేవారు. దాన్ని నేను తెలుగులోకి అనువదించేవాణ్ని. అంతా పూర్తయ్యాక  ‘చెత్తలా ఉంది కదా. ప్రభాస్‌ గారంటే ఎలా ఉండాలన్నా?’ అని నేను అనగానే ‘చెప్పడం కాదురా రాయాలి. మొన్న పార్టీలో చెప్పావుగా సినిమా చేస్తానని’ అని అందులోని ఒకరు సమాధానమిచ్చారు. అవును కదా అనుకుంటూ నా దగ్గర ఉన్న ఓ పాయింట్‌ని నిర్మాతలకి చెప్పి, ఆ తర్వాత ప్రభాస్‌కి వినిపించాను. ప్రభాస్‌ అన్న వినగానే ఓకే చేయడంతో ఆశ్చర్యపోయాను. ‘బాహుబలి’ తర్వాతే ‘సాహో’ షూటింగ్‌ మొదలుపెట్టినా నాకెలాంటి ఒత్తిడీ అనిపించలేదు. ఎప్పుడూ భయపడలేదు. ఈ సినిమా తెరకెక్కించే క్రమంలో సాంకేతికంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నాకంటే ఎక్కువగా ఎవరైనా నమ్ముతారు అంటే అది ప్రభాస్‌ అన్నే. ఇప్పుడు ఫోన్‌ చేసి ‘అన్నా.. నా దగ్గర కథ ఉంది సినిమా చేస్తారా?’ అంటే చేస్తాడాయన. ఎందుకంటే ఆయన నన్ను నమ్ముతున్నాడు. ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. నేను కలిసిన ది బెస్ట్‌ పర్సన్‌ జాబితాలో ప్రభాస్‌ అన్న టాప్‌లో ఉంటాడు.

అడివి శేష్‌, సుజిత్‌.. మీ ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు?

శేష్‌: చాలా సాధారణంగా ఇండస్ట్రీ పద్ధతిలోనే కలిశాం. నేను హీరో అవకముందు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నుంచి ఓరోజు కాల్‌ వచ్చింది. ‘పంజా’లో బాగా నటించావు.. శర్వానంద్‌ నటిస్తున్నా చిత్రంలో ఓ పాత్ర ఉంది చేస్తావా’ అన్నారు. కొత్త దర్శకుడు కదా ఏం చేస్తాం అనుకుని, నో చెప్పేందుకు యూవీ క్రియేషన్స్‌ ఆఫీసుకి వెళ్లాను. వెళ్లగానే సుజిత్‌ కనిపించాడు. ‘అన్నా ఓ కథ చెప్తా.. వినండి’ అని మొదలెట్టాడు (నవ్వులు). (శర్వానంద్‌ హీరోగా సుజిత్‌ తెరకెక్కించిన చిత్రమే ‘రన్‌ రాజా రన్‌’. ఇందులో ఓ మంచి పాత్ర పోషించాడు శేష్‌)

మీ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. లోపల కోపం ఉన్నా బయటకి నవ్వుతూ కనిపించాలి. అలాంటి సందర్భాల గురించి చెప్పండి.

సుజిత్‌: కెరీర్‌ తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. దర్శకుడ్ని అవకముందు ఓ నిర్మాత.. ‘ఏంటి? నువ్వేమన్నా తోపు అనుకుంటున్నావా. సినిమా తీయడం అంత తేలిక కాదు ఇక్కడ. నేను రాసిస్తున్నా నువ్వు జీవితంలో దర్శకుడివి కాలేవు. ఒకవేళ అయినా హిట్ కొట్టలేవు’ అన్నాడు. అప్పుడు అతని ముందే సరే అన్నాను. తర్వాత హిట్‌ కొట్టా. దాంతో ఆ నిర్మాత ఆఫీసు నుంచే కాల్‌ వచ్చింది. సర్‌ మిమ్మల్ని కలవాలట అని ఎవరో మాట్లాడారు. ‘సర్‌ (నన్ను ఉద్దేశించి) చాలా బిజీగా ఉన్నారు’ అని సమాధానం ఇచ్చాను. ఇప్పుడు ఆయన్ను చూస్తే నవ్వొస్తుంది కానీ కోపం రావట్లేదు.

శేష్‌: ‘క్షణం’ సినిమా సమయంలో నిర్మాణ సంస్థ పీవీపీ ఆఫీసుకి వెళ్లాను. ‘‘ఓ వైపు ‘ఊపిరి’.. మరోవైపు ‘బ్రహ్మోత్సవం’ తీస్తున్నప్పుడు మధ్యలో ఈ చిన్న సినిమా ఏంట్రా? ‘వీడికి ఇప్పుడు టీ ఇవ్వలా నేను’’ అన్నట్లు ప్రవర్తించేవారు అక్కడి ఆఫీసు బాయ్స్‌. అప్పుడు ఏదోలా ఉండేది. ఆశ్చర్యం నడుమ ఫైనల్‌గా ‘క్షణం’ కథ ఓకే అయింది.

సుజిత్‌, అడివి శేష్‌ పంచుకున్న మరిన్ని సంగతులు కింది వీడియోలో వీక్షించండి..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని