Sai Pallavi: ఆ రూమర్స్‌ నిజమయ్యాయి.. నాగ చైతన్య- సాయి పల్లవి జోడీ ఫిక్స్‌

నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి మరో సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజుల క్రితం రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దానిపై అధికారిక ప్రకటన వెలువడింది.

Updated : 20 Sep 2023 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించే అవకాశాలున్నాయంటూ కొన్ని రోజుల క్రితం రూమర్స్‌ వచ్చాయి. తాజాగా అవి నిజమయ్యాయి. తమ సినిమాలో కథానాయికగా సాయి పల్లవిని ఎంపిక చేశామంటూ దర్శక, నిర్మాతలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. #NC23 (నాగ చైతన్య 23వ చిత్రం) అనేది ఈ సినిమాకి వర్కింగ్‌ టైటిల్‌. ఇంతకుముందు చైతన్య-సాయి పల్లవి జోడీ ‘లవ్‌స్టోరి’ సినిమాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ తర్వాత చైతన్య-చందూ కాంబోలో రానున్న మూడో చిత్రమిది.

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నెటిజన్ ట్వీట్‌.. డైరెక్టర్‌ స్ట్రాంగ్‌ రిప్లై..!

ఈ సినిమా నేపథ్యమిదీ..

2018 నవంబరులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలో వీరవల్‌ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున సరిహద్దు దేశం పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. వీరు పాకిస్థాన్‌లో ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజులకే కోస్టుగార్డులకు చిక్కడం, భార్యకు కాన్పు జరిగినా ఏ బిడ్డ పుట్టిందో కూడా తెలియని స్థితి, బాలింతగా భార్య అవస్థలు వంటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని దానికి ఓ ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మేరకు నాగ చైతన్య, చందూ మొండేటి, నిర్మాత బన్నీవాసు కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని కొత్త మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించి, మత్స్యకారుల జీవన స్థితిగతులు, వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానం, ఇబ్బందులు, వ్యవహార శైలి, యాస గురించి తెలుసుకున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది.

చాలా సంతోషంగా ఉన్నా: సాయి పల్లవి

కొత్త చిత్రం ప్రకటనపై సాయి పల్లవి సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులారా.. మిమ్మల్ని చాలా మిస్‌ అయ్యా. ఇప్పుడు #NC23 ద్వారా కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా’’ అని తెలిపారు. ‘‘మీరు ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని నాగ చైతన్య సాయి పల్లవి పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని