Smriti Irani: రూ.కోట్లు ఇస్తానన్నా.. ఆ యాడ్‌ చేయనని చెప్పా: స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను నటిగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం గురించి తెలిపారు.

Published : 09 Jul 2023 01:32 IST

ముంబయి: రాజకీయాల్లోకి రాకముందు నటిగా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు స్మృతి ఇరానీ (Smriti Irani). ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతోన్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సీరియల్స్‌లో యాక్ట్‌ చేసిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. రూ. కోట్లలో డబ్బు ఇస్తానని చెప్పినప్పటికీ తాను ఓ యాడ్‌లో నటించడానికి సముఖత వ్యక్తం చేయలేదన్నారు.

‘‘నటిగా కెరీర్‌ ఆరంభించిన రోజులు నాకింకా గుర్తు. ఆ సమయంలో నా వద్ద సరిగ్గా డబ్బుల్లేవు. బ్యాంక్‌ ఖాతాలో రూ.30 వేలు కూడా ఉండేవి కాదు. పెళ్లైన కొత్తలో బ్యాంక్‌ నుంచి రూ.25 లక్షలు లోన్‌ తీసుకుని ఇంటిని కొనుగోలు చేశా. అప్పట్లో ప్రతి నెలా ఈఎంఐ చెల్లించడం ఎంతో కష్టంగా అనిపించేది. అలాంటి సమయంలో ఓరోజు నా వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చారు. తమ పాన్‌ మసాలా యాడ్‌లో పనిచేయమని కోరారు. ఒకవేళ నేను ఓకే అంటే.. రూ.కోట్లలో డబ్బులు ఇస్తామన్నారు. కాకపోతే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా. ‘‘నీకు ఏమైనా పిచ్చా. అంత డబ్బు ఇస్తుంటే చేయనని చెబుతున్నావు’’ అని వాళ్లు అన్నారు’’ అని స్మృతి ఇరానీ తెలిపారు.

అనంతరం.. ఆ యాడ్‌ను అంగీకరించకపోవడానికి గల కారణంపై మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో ప్రేక్షకులందరూ నన్ను కూడా తమ కుటుంబ సభ్యురాలిగా భావించారు. అలాంటప్పుడు నేను ఇలాంటి యాడ్స్‌లో నటిస్తే వాళ్లు ఎలా తీసుకుంటారో..? అనిపించింది. అదీ కాక, చిన్నపిల్లలు సైతం ఈ ప్రకటనలు చూసే ప్రమాదం ఉంది. అందుకే నేను పాన్‌ మసాలా యాడ్స్‌తోపాటు అల్కహాల్‌ కంపెనీలకు చెందిన కొన్ని డ్రింక్స్‌ ప్రకటనలనూ తిరస్కరించా’’ అని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని