మనసు కదిలించిన మనసు కవి పాటలు

శ్రీ కిళంబి వెంకట నరసింహాచార్యులు అంటే ఎంతోమందికి తెలియకపోవచ్చేమో కానీ మనసు కవి, మనసు కవి శ్రీ ఆచార్య ఆత్రేయ అంటే తెలియని తెలుగు వారుండరు....

Updated : 07 May 2021 14:21 IST

ఆత్రేయ శత జయంతి ప్రత్యేకం

శ్రీ కిళంబి వెంకట నరసింహాచార్యులు అంటే ఎంతోమందికి తెలియకపోవచ్చేమో కానీ మనసు కవి ఆచార్య ఆత్రేయ అంటే తెలియని తెలుగు వారుండరు. శుక్రవారం ఆయన శత జయంతి సందర్భంగా.. ఆయన గురించి మాట్లాడేస్థాయి, అర్హత, వయసు నాకు లేవు కానీ ఒక అభిమానిగా నాకు నచ్చిన వారి పాటల్లోంచి కొన్నింటి గురించి చెప్పే ప్రయత్నమే ఈ కథనం. యూట్యూబ్‌ వచ్చేదాకా ఆయన పాటల్ని రేడియోలో వినటం తప్ప చూసింది లేదు. తర్వాత ఆయన రచించిన పాటలు చూసి ఇంకా అభిమానం పెంచుకున్నాను.

అభ్యుదయ వాది..!

తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అని శ్రీశ్రీ ఆవేశపడితే, అదే రీతిలో ‘తోడికోడళ్లు’ సినిమాలో కారులో షికారుకెళ్లే అన్న పాటలో.. ‘‘చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా, మేడకట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా.. కడుపు కాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి చేర్చి తీర్చినారు తెలుసుకో’’ అంటూ కథానాయకుడితో చెప్పించిన సామ్యవాది ఆత్రేయ. చాలామందిలా నేను కూడా ఇది శ్రీశ్రీగారు రాశారేమో అనుకున్నాను. తర్వాతే తెలిసింది ఇది ఆత్రేయ గారి రచన అని.

అలాగే ‘ఆకలి రాజ్యం’ సినిమా అంతా శ్రీశ్రీ గారి మహాప్రస్థానం వల్లె వేస్తూ హీరో కనిపించినా.. ‘‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్‌’’ అంటూ ఆనాటి నిరుద్యోగ పరిస్థితుల మీద ఆత్రేయ గారు వేసిన వ్యంగ్యాస్త్రం ఆ పాట. అదే పాటలో ‘‘ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా’’ అంటూ వేసిన ప్రశ్న సూటిగా సమాజాన్ని ప్రశ్నిస్తుంది. అలా రాయడం ఆయనకే చెల్లింది.


మనసు కవి..!

మనసు మీద ఎన్నో గీతాలు రాసిన ఆయన మనసు కవిగా స్థిరపడిపోయారు. ‘‘మనసు గతి ఇంతే’’ అనే పల్లవితో మొదలయ్యే ఓ పాటలో.. ‘‘మట్టేనని తెలుసు అదీ ఒక మాయే అని తెలుసు, తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసు?’’ అంటూ విరహంలోని తియ్యదనాన్ని చెప్పే కోణం ఎంతో కొత్తగా ఉంటుంది. ఇప్పుడంటే ప్రతి సినిమాలో ఓ బ్రేకప్‌ పాట ఉంటుంది కానీ మొదటి తరం విరహ గీతాల్లో అదొక సెన్సేషన్‌ అని మాత్రం చెప్పవచ్చు.

‘నేనొక ప్రేమపిపాసిని, ఈ దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది’’ అంటూ ఎన్నో భగ్న గీతాలు రాసిన ఆయన కూడా భగ్న ప్రేమికుడే ఆట, అందుకే అలా రాయగలిగారేమో.


నవ్వూ ఏడుపూ..!

ఆయన రాసిన పాటలు ఏడిపిస్తూ నవ్విస్తాయి, అదే ఆయన కలం బలం. ‘మూగ మనసులు’లోని ‘ముద్దబంతి పువ్వులో మూగ కళ్ల ఊసులో’ అనే పాటలో ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా’ అంటూ రాశారు అందుకేనేమో ఆయనకు నవ్వించడమూ తెలుసు ఏడిపించటమూ తెలుసు.


విలక్షణం

నాకు వ్యక్తిగతంగా ఆయన పద ప్రయోగాల కంటే కూడా అందులోని హావభావాలంటే ఎంతో ఇష్టం. ఉదాహరణకి ‘డాక్టర్‌ చక్రవర్తి’లో ‘నీవు లేక వీణ’ పాటలో ‘కలలనైనా నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడా రావే’ అంటూ కథానాయికతో పలికిస్తాడు. ఎంత గొప్ప భావం.

అలాగే ‘ప్రేమనగర్‌’ చిత్రంలో ‘తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా’ అంటూ కథానాయికని తెలుగుతో పోల్చడం చాలా నచ్చింది.


అంతా ప్రేమ మయం..!

ఆయన రాసిన సుమారు 1400 గీతాల్లో 90 శాతం ప్రేమ గీతాలే ఉంటాయేమో. ముందు ఆయన పాటలు రాశాకే ‘అభినందన’ చిత్రానికి కథ సమకూర్చుకున్నారట. ఎంత గొప్ప విషయం. అది ఆయన పాటకి దక్కిన గౌరవం. అందులో ‘ప్రేమ ఎంత మధురం’ అనే పాటలో ‘నేనోర్వలేను ఈ తేజము, ఆర్పేయు రాదా ఈ దీపము’ అనే పంక్తి నాకు చాలా ఇష్టం.

అలా ఎన్నో ప్రేమ గీతాలు, ‘ప్రేమ’లోని  ‘ప్రియతమా నా హృదయమా’ అనే పాటలో నువ్వు లేని నన్ను ఊహించలేను ఈ వేదనంతా నివేందిచలేను అమరం అఖిలం మన ప్రేమ’ అని రాశారు. ఎంత అలతి పదాలతో ఎంత గొప్ప భావం.


మరో కోణం..!

ఇలాంటి గీతాలు రాసిన ఆయనే ‘దసరా బుల్లోడు’లో ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా’ అంటూ మొత్తం ఆంధ్ర దేశంతో స్టెప్పులేయించారు. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ అంటూ సరదా యుగళ గీతాలకి ప్రాణం పోశారు.

నిర్మాత వెంటపడినా కదలని కలం.. మద్రాసు బీచ్‌రోడ్డులో కారులో వెళ్తుంటే పడుతున్న చినుకుల్ని చూసి కదిలిందట. ‘ఆత్మబలం’ చిత్రంలోని ‘చిటపట చిటపట చినుకులు పడుతూ ఉంటే’..  అదే మన మొదటి సూపర్‌ హిట్‌ వాన పాట. తర్వాత తెలుగు సినిమాల్లో కొన్ని దశబ్దాలపాటు వాన పాట స్థానం సంపాదించుకుంది. ఇలా చెప్తూ పోతే ఎంతైనా సరిపోదు. ఆయన తేలిక పదాలతో జనాల నాలుకల మీద ఆడే సాహిత్యంతోనే వందేళ్లైనా ఇంకా జనం గుండెల్లో ‘‘మనసు కవి’’గా నిలిచిపోయారు.


చివరిగా..!
గుండె మంటలారిపే సన్నీళ్లు కన్నీళ్లు ఉండమన్నా ఉండవమ్మా సాన్నాళ్లు

పోయినోళ్లు అందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు.

మీ పాటకి మరణం లేదు.. ఆత్రేయ గారికి ఇదే మా నివాళి... 

కృష్ణకాంత్‌, తెలుగు గీత రచయిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని