Mahesh Babu Thaman: ‘మీ దూకుడు సాటెవ్వరు’.. మహేశ్‌కు తమన్‌ ‘పాట’ తోడైతే!

మొన్న ‘కళావతి’, నిన్న ‘మ మ మహేశా’.. ఒకటి క్లాస్‌, మరొకటి ఫుల్‌ మాస్‌.. అయినా రెండు పాటలకూ ఒకేలాంటి క్రేజ్‌.. దీనికి కారణం నటుడు మహేశ్‌బాబు- సంగీత దర్శకుడు తమన్‌ల మ్యాజిక్‌.

Updated : 08 May 2022 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొన్న ‘కళావతి’, నిన్న ‘మ మ మహేశా’.. ఒకటి క్లాస్‌, మరొకటి ఊర మాస్‌.. అయినా రెండు పాటలకూ ఒకేలాంటి క్రేజ్‌.. దీనికి కారణం నటుడు మహేశ్‌బాబు- సంగీత దర్శకుడు తమన్‌ల మ్యాజిక్‌. ప్రతి హీరో చిత్రానికీ.. వినగానే ‘కిక్‌’ ఇచ్చే మ్యూజిక్‌ని అందించే తమన్‌.. మహేశ్‌ సినిమాకు పనిచేస్తే ఇంకాస్త జోష్‌ పెరుగుతుంది. అందుకే ‘మీ దూకుడు సాటెవ్వరు’ అంటూ సంగీత అభిమానులు ఈ కాంబోను  పొగిడేస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి పనిచేసిన ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదలవుతున్న సందర్భంగా వీరి సూపర్‌ హిట్‌ గీతాలను మరోసారి విందాం.

అలా మొదలైంది వీరి దూకుడు

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘దూకుడు’ సినిమాతో ఈ కాంబో సెట్‌ అయింది. యాక్షన్‌-కామెడీ ప్రధానంగా సాగే ఈ కథకు తమన్‌ అందించిన సంగీతం మరో స్థాయిలో నిలిచింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కథానాయకుడిని ఎలివేట్‌ చేసే టైటిల్‌ సాంగ్‌ ‘నీ దూకుడు’, నాయికపై ఉన్న ప్రేమను నాయకుడు వివరించే గీతం ‘గురువారం మార్చి 1’, స్పెషల్‌ సాంగ్‌ ‘పువాయ్‌ పువాయ్‌ అంటాడే ఆటో అప్పారావు’, పెళ్లి వేడుక నేపథ్యంలో వచ్చే ‘అదర అదరగొట్టు’తోపాటు ‘చుల్‌బులి’, ‘దేత్తడి దేత్తడి’.. ఇలా ప్రతిదీ సూపర్‌హిట్‌గా నిలిచి, టాలీవుడ్‌లో మంచి కాంబినేషన్‌కు నాంది పలికింది.


మరోసారి మాంచి బిజినెస్‌ చేశారు

బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘దూకుడు’ తర్వాత మహేశ్‌ నటించిన చిత్రం ‘బిజినెస్‌మ్యాన్‌’. పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ సినిమాకీ తమనే స్వరాలందించాడు. ఈ చిత్రంలో మహేశ్‌ ఎంత రఫ్‌గా కనిపిస్తాడో తెలిసిన విషయమే. దానికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వడంలో తమన్‌ మంచి మార్కులు కొట్టేశాడు. అలా అని సాదాసీదా పాటలిచ్చాడనుకుంటే పొరపాటే. ముంబయి నేపథ్యంలో సాగే ఈ స్టోరీకి థీమ్‌ మ్యూజిక్‌ను ఎంత వైవిధ్యంగా ఇచ్చాడో ‘సారొస్తారొస్తారా’, ‘వి లవ్‌ బ్యాడ్‌బాయ్స్‌’, ‘చందమామ’, ‘పిల్ల చావ్‌ పిల్లా’ పాటలతో ఓ ఊపు ఊపేశాడు. అంతేనా.. మహేశ్‌బాబుతోనూ పాడించాడు. ‘బిజినెస్‌మ్యాన్‌ థీమ్‌’లో మహేశ్‌ స్వరం వినొచ్చు.



రెండోసారి ఆగడు

‘దూకుడు’తో సూపర్‌ హిట్‌ కాంబోగా నిలిచిన దర్శకుడు శ్రీను వైట్ల, మహేశ్‌, తమన్‌ మరోసారి ‘ఆగడు’తో సందడి చేశారు. సినిమా.. అభిమానులు ఆశించనంత విజయం అందుకోలేకపోయినా పాటలు మాత్రం ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ‘దూకుడు’లో ఉన్నట్టే  ఇందులోని హీరో ఎలివేషన్‌ సాంగ్‌ ‘ఆగడు’, ఐటెమ్‌ సాంగ్‌ ‘జంక్షన్‌లో’, హుషారెత్తించే గీతాలు ‘నారీ నారీ’, ‘భేల్‌ భేల్‌ పూరి’, మెలొడీ ‘ఆజా సరోజా’ ఎంతగానో అలరించాయి.


ఆరేళ్ల తర్వాత

‘ఆగడు’ తర్వాత సుమారు ఆరేళ్లకు మహేశ్‌-తమన్‌ మరోసారి కలిసి పనిచేశారు. ఆ చిత్రమే ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లోని పాటలు ఇటీవల విడుదలై, విశేష స్పందన పొందుతున్నాయి. ముఖ్యంగా ‘కళావతి’ గీతం తక్కువ కాలంలోనే 160కిపైగా మిలియన్‌ వ్యూస్‌ (యూట్యూబ్‌) సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ‘పెన్నీ’.. 30కిపైగా మిలియన్‌ వీక్షణలు, టైటిల్‌ గీతం ‘సర్కారు వారి పాట’కు 10కిపైగా మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకోగా శనివారం విడుదలైన ‘మ మ మహేశా’ మాస్‌ పాట 11కిపైగా మిలియన్‌ వ్యూస్‌ తో సరికొత్త రికార్డు నెలకొల్పేలా దూసుకుపోతోంది.


మరొకటి సిద్ధమవుతోంది

మహేశ్‌- తమన్‌ బంధం కొనసాగుతూనే ఉంది. ‘సర్కారు వారి పాట’ విడుదలకు ముందే వీరిద్దరి కలయిలో మరో సినిమా సిద్ధమవుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల ప్రారంభమైందీ చిత్రం. తమ అభిమాన హీరోకి నాలుగు సూపర్‌హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చిన తమన్‌ ఈసారి ఎలా ఆకట్టుకుంటాడోనని మహేశ్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని