Tollywood Roundup: ‘వీరసింహారెడ్డి’ నుంచి ‘స్పై’ వరకు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు విడుదలైన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్‌ అయింది? ఏ సినిమా పరాజయం పొందిందంటే?

Updated : 30 Jun 2023 11:23 IST

ప్రేక్షకులను అలరించేందుకు ప్రతి ఏడాదీ వందల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని విజయవంతంగా మరికొన్ని ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోతాయి. మరి, ఈ ఏడాది ఇప్పటి వరకు బాక్సాఫీసు ముందుకు ఏయే సినిమాలు వచ్చాయి? వాటి రిజల్ట్‌ ఏంటి? గుర్తు చేసుకుందామా..

జనవరి.. అగ్ర హీరోలతో సరి!

చిత్ర పరిశ్రమకు సంబంధించి అతిపెద్ద సీజన్‌ సంక్రాంతి. ఆ పండుగ హంగామా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)తో మొదలైంది. ఒక్క రోజు (జనవరి 13) తేడాతో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)తో చిరంజీవి బరిలో దిగారు. అగ్ర హీరోలైన వీరిద్దరు పొంగల్‌ పోరులో నిలవడం కొత్తేమీ కాదు. కానీ, ఒకే నిర్మాణ సంస్థ (మైత్రీ మూవీ మేకర్స్‌) రూపొందించిన రెండు పెద్ద చిత్రాలు ఒక్క రోజు వ్యవధితో విడుదలవడం, ఆ రెండు సినిమాల్లో హీరోయిన్‌ (శ్రుతిహాసన్‌) ఒక్కరేకావడం విశేషం. ప్రేక్షకులు కోరుకున్న అంశాలన్నీ ఉన్న ఈ రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. జనవరి 14న వచ్చిన సంతోష్‌ శోభన్‌ ‘కల్యాణం కమనీయం’ (Kalyanam Kamaneeyam) సినిమా అలరించలేకపోయింది. ‘హంట్‌’ (Hunt) సుధీర్‌బాబు అంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. జనవరి 26న విడుదలైందీ చిత్రం.

ఫిబ్రవరి.. చిన్న సినిమాకు గురి!

ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకు వచ్చిన తొలి హీరో సందీప్‌ కిషన్‌. ఆయన నటించిన ‘మైఖేల్‌’ చిత్రం ఆ నెల 3న విడుదలైంది. విజయ్‌ సేతుపతి, వరుణ్‌ సందేశ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌లాంటి వారు మెరిసినా సినిమా ఆకట్టుకోలేకపోయింది. అదే రోజున ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan)గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్‌ మెప్పించారు. ఫిబ్రవరి 4న విచ్చేసిన ‘బుట్టబొమ్మ’ ఆడియన్స్‌ని ఆకర్షించలేకపోయింది. మలయాళ సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘కప్పేలా’కు రీమేక్‌ ఇది. ‘బింబిసార’తో గతేడాది విజయాన్ని నమోదు చేసిన నందమూరి కల్యాణ్‌ రామ్‌.. ఈ ఏడాది ‘అమిగోస్‌’ (Amigos)తో పలకరించారు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలై, అంచనాల్ని అందుకోలేకపోయింది.

‘రఘువరన్‌ బీటెక్‌’ వంటి అనువాద చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ధనుష్‌ తెలుగు దర్శకుడితో చేసిన తొలి సినిమా ‘సార్‌’ (Sir). విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి మార్కులేశారు. ఫిబ్రవరి 17న రిలీజైంది. 18న వచ్చిన కిరణ్‌ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) నంబర్‌ నేబర్‌ అనే కొత్త కాన్సెప్ట్‌తో బాగుంది అనిపించగా.. ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. సంతోష్‌ శోభన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.

మార్చి.. హీట్‌ పెంచి!

మార్చిలో ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే సినిమాలకు సంబంధించి బాక్సాఫీసు వద్ద వసూళ్ల హీట్‌ పెరిగింది. ‘బలగం’ (balagam)తో అది మొదలైంది. మట్టివాసన కథల్ని తెరపైకి తీసుకొస్తే అద్భుత విజయం సాధించొచ్చని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయం ఇతివృత్తంగా రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 27 కోట్ల వసూళ్లతోపాటు అంతర్జాతీయంగా పలు అవార్డులు దక్కించుకుంది. కథ బలంగా ఉంటే స్టార్‌ నటుల్లేకపోయినా సక్సెస్‌ సొంతం చేసుకోవచ్చనే అంశాన్ని గుర్తుచేసింది. హాస్య నటుడైన వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. దీంతోపాటు మార్చి 3న విడుదలైన ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ సందడి చేయలేకపోయింది. 10న వచ్చిన ‘సి.ఎస్‌.ఐ. సదన్‌’, 17న వచ్చిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మెరవలేకపోయాయి. ‘దాస్‌ కా ధమ్కీ’తో విశ్వక్‌ సేన్‌ మాస్‌ ప్రేక్షకులతో విజిల్‌ వేయించారు. ‘రంగమార్తాండ’తో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నారు. ఈ రెండూ మార్చి 22న విడుదలయ్యాయి. మార్చి 30న రిలీజైన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (dasara) తెలుగులో ఘన విజయం సొంతం చేసుకుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఏప్రిల్‌.. పెద్దగా లేవు మెరుపుల్‌!

ఏప్రిల్‌లో 10కిపైగా సినిమాలు విడుదలకాగా సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘విరూపాక్ష’ (Virupaksha) మాత్రమే హిట్‌గా నిలిచింది. తాంత్రిక శక్తులు, ఆత్మల కాన్సెప్ట్‌తో రుద్రవనం అనే ఊరి చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచింది. రవితేజ నటించిన సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’ (Ravanasura) ఫర్వాలేదనిపించగా భారీ అంచనాలతో విడుదలైన సమంత ‘శాకుంతలం’ (Shaakuntalam), అఖిల్‌ ‘ఏజెంట్‌’ (Agent) బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. కిరణ్‌ అబ్బవరం నటించిన ‘మీటర్‌’ తిరగలేకపోయింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘హలో.. మీరా..!’ ప్రశంసలు అందుకుంది.

మేలో.. కాంబినేషన్లు మెరవలేదు..!

‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous) మినహా మేలో విడుదలైన ‘అన్ని మంచి శకునములే’ (Anni Manchi Sakunamule), ‘కథ వెనుక కథ’, ‘భువన విజయమ్‌’, ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli)వంటి తక్కువ బడ్జెట్‌ చిత్రాలు ఫేమస్‌ కాలేకపోయాయి. నాగచైతన్య ‘కస్టడీ’ (Custody) ప్రేక్షకులను బందీ చేయలేకపోయింది. ఆసక్తి రేకెత్తించిన హీరో- డైరెక్టర్‌ కాంబినేషన్లూ మిశ్రమ స్పందనకే పరిమితమయ్యాయి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత గోపీచంద్‌- శ్రీవాస్‌ కాంబోలో తెరకెక్కిన ‘రామబాణం’ (Ramabanam), ‘నాంది’ తర్వాత అల్లరి నరేశ్‌- విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన ‘ఉగ్రం’ (Ugram) ఒకే రోజు బాక్సాఫీసు ముందుకు వచ్చి, నిరాశ పరిచాయి.

జూన్‌.. పరేషాన్‌!

ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు మనవడు అభిరామ్‌ హీరోగా పరిచయమైన ‘అహింస’, బెల్లంకొండ గణేశ్‌ ‘నేను స్టూడెంట్‌ సర్‌!’ పాస్‌ కాలేదు. తిరువీర్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘పరేషాన్‌’ కడుపుబ్బా నవ్వించింది. ‘ఇంటింటి రామాయణం’, ‘విమానం’ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ్‌ ‘టక్కర్‌’ ప్రయత్నం ఫలించలేదు. ఈ నెలలో విడుదలైన భారీ బడ్జెట్‌ చిత్రం ఒక్కటే. అదే ‘ఆదిపురుష్‌’ (Adipursuh).ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందనతోనూ రూ. 450 కోట్లకుపైగా కలెక్షన్స్‌ సాధించింది. జూన్‌ 16న విడుదలైన ఈ సినిమా వివాదాలు ఇంకా ముగియలేదు. ఈ నెలాఖరున వచ్చిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ (samajavaragamana) ప్రేక్షకులకు నవ్వులు పంచుతుండగా.. నిఖిల్‌ నటించిన ‘స్పై’ (Spy) అంచనాలు అందుకోలేకపోయింది.

అనువాదాలు ఇలా..

అజిత్‌ ‘తెగింపు’, విజయ్‌ ‘వారసుడు’, విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌ల ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’, విజయ్‌ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’, టోవినో థామస్‌ ‘2018’ చిత్రాలు తెలుగులో మంచి మార్కెట్‌ సెట్‌ చేసుకున్నాయి. స్టార్‌ కాస్టింగ్‌ ఉన్నా.. భారీ బడ్జెట్‌ అయినా.. కొత్తదనం ఉన్న కథలకే ప్రేక్షకులకు పట్టం కడుతున్నారనే విషయం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదలైన సినిమాలన్నింటి విషయంలో స్పష్టమైంది. ద్వితీయార్ధంలో రాబోయే సినిమాలన్నీ అలరించాలని కోరుకుందాం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని