Tollywood: మాస్ లుక్‌లో కనిపించి.. ఆశ్చర్యానికి గురిచేసి!

పూర్తిస్థాయి మాస్‌ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన టాలీవుడ్‌ హీరోలపై ప్రత్యేక కథనం...

Published : 06 Feb 2023 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పక్కింటి కుర్రాడిలా ఉండేవాడు ఇలా మారిపోయాడేంటి?’, ‘ఎంత క్లాస్‌గా ఉండేవాడు! మాస్‌ లుక్‌లోనూ అదరగొట్టాడు’.. ‘దసరా’ సినిమా స్టిల్స్‌, టీజర్‌ చూసిన వారంతా అనుకున్న మాటలివి. ధరణి అనే పాత్ర కోసం అంతగా తన శైలిని పూర్తిగా మార్చుకున్నారాయన. అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటి? గతంలో ఇలాంటి గెటప్పుల్లో కనిపించిన హీరోలెవరు? భవిష్యత్తులో కనిపించబోయేదెవరు? చూద్దామా...

క్లాసీ కథలకే పరిమితంకాకూడదని, మాస్‌ ప్రేక్షకులనూ అలరించాలని దాదాపు అందరు హీరోలు అనుకుంటారు. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న వాళ్లూ రఫ్‌ లుక్‌ ప్రయత్నించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పటికే పలు మాస్‌ నేపథ్య చిత్రాల్లో నటించిన సీనియర్‌ కథానాయకులు సైతం మళ్లీ అలాంటి సినిమాల్లో కనిపించేందుకు సై అంటుంటారు. ఆ జానర్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. అలా హిట్‌ అందుకున్న హీరో రేంజ్‌ పూర్తిగా మారిపోతుంది. ఆ మాస్‌ కాస్తా మరో అడుగుముందుకేసి ఊరమాస్‌గా మారింది.

వీర్లపల్లి యువకుడు..

కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న నాని (Nani) ఎక్కువగా యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చే సినిమాలు చేశారు. కొన్నింటిలో మాస్‌ కోణాన్ని చూపించిన ఆయన ‘దసరా’లో ఊరమాస్‌గా కనిపిస్తారు. సింగరేణి బొగ్గు గనులకు సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామ యువకుడు ధరణి అనే పాత్రలో ఆయన నటించారు. ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచే నాని అభిమానులు, సినీ ప్రియుల్లో ఆసక్తి మొదలైంది. మాసిపోయిన బట్టలు, పొడవాటి జుత్తు, మెడలో తాడు.. ఇలా ప్రతిదీ ఆయన పాత్ర ఎంత వైలెంట్‌గా ఉంటుందోనన్న ఉత్సుకత పెంచాయి. ఇటీవల విడుదలైన టీజర్‌ అంచనాలను మరింత పెంచేసింది. నాని యాక్షన్‌, తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు ప్రేక్షకులను ఆశ్చర్యంలో పడేశాయి. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ చిత్రం 2023 మార్చి 30న విడుదలకానుంది.

స్టూవర్టుపురం గజదొంగ..

మాస్‌ అంటే టాలీవుడ్‌లో ఠక్కున గుర్తొచ్చే పేరు రవితేజ (Ravi Teja). మాస్‌ మహారాజ్‌గా గుర్తింపు పొందిన ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకటి. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్‌ మునుపెన్నడూ చూడని విధంగా ఉండనుంది. సంబంధిత ప్రాంత యాసను ఆయన నేర్చుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ రవితేజ ఊరమాస్‌గా కనిపిస్తారని చెప్పకనే చెప్పింది. 1970ల నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు వంశీ (దొంగాట ఫేం) తెరపైకి తీసుకొస్తున్నారు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

పుష్పరాజు కొనసాగిస్తున్నాడు..

‘రేసుగుర్రం’, ‘సరైనోడు’వంటి యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో మాస్‌గా కనిపించిన అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) కోసం తొలిసారి ఊరమాస్‌ గెటప్పు ధరించారు. అందులోని పుష్పరాజ్‌ పాత్ర ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన విషయం తెలిసిందే. స్టైలిష్‌ స్టార్‌గా పేరున్న ఆయన డీ గ్లామర్‌గా కనిపించిన తీరు అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఆయన చేసిన యాక్షన్‌ కట్టిపడేసింది. పుష్పరాజ్‌ మ్యానరిజం ట్రెండ్‌ సెట్‌ చేసింది. రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్‌’తో బన్నీ త్వరలో మళ్లీ అదే లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

వెంకటేశ్‌ ఇలా..

‘వెంకటేశ్‌ (Venkatesh) ఇలాంటి సినిమాలు కూడా చేయగలరా?’ అని అందరితో అనిపించింది ‘నారప్ప’ (Narappa). అంతటి పవరఫుల్‌ రోల్‌ అది. ‘భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు’ అంటూ  చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించారు. 2021లో నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా ప్రేక్షకులను అలరించింది.

గణేష్‌గా వరుణ్‌తేజ్‌..

‘ముకుంద’, ‘కంచె’, ‘ఫిదా’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్‌ 2’.. ఇలా సినిమాసినిమాకు వైవిధ్యాన్ని చూపించిన వరుణ్‌తేజ్ (Varun Tej) ‘గద్దలకొండ గణేష్‌’ (Gaddalakonda Ganesh)లో చాలా కొత్తగా కనిపించారు. పొడవాటి జుత్తు, గుబురు గడ్డంతో ఈ అరడుగుల కటౌట్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. అందులోని గని పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 2019లో విడుదలైన ఈ సినిమాకి హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు.

చిట్టిబాబు విశ్వరూపం..

రామ్‌చరణ్‌ (Ram Charan)లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ఏదంటే? చాలామంది చెప్పే సమాధానం ‘రంగస్థలం’ (Rangasthalam). చిట్టిబాబుగా ఆయన నట విశ్వరూపం చూపించారు. పల్లెటూరి వ్యక్తిగా ఆయన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలై, టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని