Sirivennela: ‘సిరివెన్నెల’ కోసం రెండు రోజులు వెతికిన చిరంజీవి

సినీసాహిత్య వినీలాకాశంలో ఓ ధ్రువతారగా చెప్పుకొనే ప్రముఖ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సిరివెన్నెలతో తమకున్న అనుంబంధాన్ని సినీ ప్రముఖులు....

Updated : 29 Oct 2023 11:49 IST

మధుర జ్ఞాపకాలపై పలు సందర్భాల్లో ‘సిరివెన్నెల’ ఏం చెప్పారంటే

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీవినీలాకాశంలో ధ్రువతారగా పేరుతెచ్చుకొన్న ప్రముఖ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సిరివెన్నెలంటే సినీ ప్రముఖుల్లో విశేషమైనా ప్రేమాభిమానాలు ఉన్నాయి. సిరివెన్నెల కూడా తన జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో మధురమైన జ్ఞాపకాలపై గతంలో పలు సందర్భాల్లో గుర్తు చేసుకొన్నారు.. అవి మీకోసం..!

‘సిరివెన్నెల’ కోసం రెండు రోజులు వెతికిన చిరంజీవి

ఒకానొక సందర్భంలో అగ్రకథానాయకుడు చిరంజీవి తనకోసం రెండు రోజులు వెతికారని సిరివెన్నెల చెప్పారు. ‘‘ఒక రకంగా నేను రాసిన రెండో పాటే చిరంజీవిది. ‘సిరివెన్నెల’ సినిమాకు ‘విధాత తలపున’ పాట రాసేసి, నేను మళ్లీ ప్రభుత్వోద్యోగానికి వెళ్లిపోయా. ఆ సమయంలో ‘వేట’ చిత్రంలో పాట కోసం దర్శకుడు కోదండరామిరెడ్డిగారు పిలిపించారు. మళ్లీ మద్రాసు వచ్చా. ఆయన చెప్పిన సన్నివేశం కోసం ‘సంయుక్తా మూవీస్‌’ అధినేతల ఆఫీస్‌లోనే ఏకంగా 20 వెర్షన్లు రాశా. పాటలు బాగా రాస్తున్నావంటూనే సంగీత దర్శకులు చక్రవర్తి ‘ట్యూన్‌కు రాస్తావా’ అంటూ ఒక స్వరం ఇచ్చారు. అప్పుడు దానికి రాసిన పాటే ‘ఓ లేడి కూనా’.. అప్పటికే ‘ఖైదీ’ తదితర చిత్రాలతో చిరంజీవి మంచి ఇమేజ్‌ ఉన్న హీరో. ఆ పాట విని, చాలా బాగుందన్నారు. నన్ను అభినందించాలని భావించి.. నా ఆచూకీ కోసం రెండు రోజులు వెతికారు. అలా గాలించి మరీ నన్ను పట్టుకొని అభినందించారు. అదీ నటుడిగా చిరంజీవిలోని మంచితనం, గొప్పతనం. వ్యక్తిగతంగా అది మా మొదటి పరిచయం. అప్పటి నుంచి ‘రుద్రవీణ’, ‘దొంగ మొగుడు’ నుంచి ‘సైరా’ వరకూ మా ఆత్మీయానుబంధం కొనసాగింది’ అని సిరివెన్నెల ఓ సందర్భంలో గుర్తు చేసుకొన్నారు.


కష్టపడి రాసిన పాట ఇది!

‘స్వర్ణకమలం’లో ‘శివపూజకు చిగురించిన’ పాటను సిరివెన్నెల పదిహేను రోజులు రాశారు. ఈ పాట కోసం తనలో తాను పడిన సంఘర్షణ అంతా ఇంతా కాదని సీతారామశాస్త్రి స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో కథానాయకుడుది  కళాకారుడి పాత్ర. కథానాయికకు కళలంటే విరక్తి. వీరి విరుద్ధ భావాల మధ్య సంఘర్షణను పాటగా రాయల్సి వచ్చింది. ఏ ఒక్కరి వాదన తక్కువగా ఉండకూడదనేది సిరివెన్నెల భావన.


‘జగమంత కుటుంబం’ పాట అవుతుందనుకోలేదు

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చక్రం’. ఇందులో ‘జగమంత కుటుంబం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ పాటను సీతారామశాస్త్రి 1970లో రాశారట. ఎన్నో వేలసార్లు పాడారట. వందల మందికి వినిపించారట. ఒకసారి ఈ పాట విన్న దర్శకుడు కృష్ణవంశీ ‘సినిమాలో పెడదాం’ అన్నారట. ‘ఎలా.. ఏ హీరోకు బాగుంటుంది. లోతైన ఫిలాసఫీ అది. భారతీయ తాత్విక చింతనకు సూక్ష్మమైన ఎక్స్‌ప్రెషన్‌. ఆత్మ పరిభాష’ అని సిరివెన్నెల చెప్పారట. అయినా కూడా కృష్ణవంశీ వినలేదు. ఆఖరికి ‘చక్రం’లో ఈ పాటను పెట్టారు. పాటను విన్న సిరివెన్నెల గురువు శివానందమూర్తి ‘కచేరీల్లో కూడా పాడుకోవచ్చు’ అన్నారట. అది తన జీవితంలో గొప్ప కాంప్లిమెంట్‌ అనేవారు సిరివెన్నెల.


అందుకే ఈ రంగంలో ఉన్నానేమో!

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన మరొక అద్భుతమైన పాట ‘దశావతార రూపకం’. క్రిష్‌ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రం కోసం సిరివెన్నెల దశవతార రూపాకాన్ని రాశారు. తొమ్మిదిన్నర నిమిషాల పాటు సాగే ఈ పాట రాయడానికే తాను ఈ రంగంలో ఉన్నానని ఓ సందర్భంలో చెప్పారు. ‘ఈ రచన చేయడానికే 28 సంవత్సరాలుగా నేను సినీ రంగంలో ఉన్నానేమో అనిపించింది. దీని తర్వాత ఏదైనా రచన చేయవచ్చా? చేయాల్సిన అవసరం ఉందా? అనిపించే స్థాయికి తీసుకెళ్లిపోయింది. ఈ దశవతార రూపకం అందరికీ అర్థమవుతుందా? అని చాలా మంది అడగవచ్చు. నేనెప్పుడూ పదాలతో, మాటలతో, ధ్వనులతో రచనలు చేయలేదు. ఆత్మ స్పందనతో చేశాను. ‘జగమంత కుటుంబం’ అన్నా, ‘ఎంత వరకు ఎందుకొరకు’ అన్నా శిశువు నుంచి వృద్ధుడు వరకూ స్పందించారు. దైవత్వానికీ, మనిషికీ ఉన్న నిర్వచనమేంటో ఈ పాట చెబుతోంది’ అని పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని