Adah Sharma: ‘ది కేరళ స్టోరీ’.. ఆ విషయంలో అభిమానికి క్షమాపణలు చెప్పిన అదా శర్మ

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) నిషేధంపై ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌కు అదా శర్మ స్పందించింది. ఈ సందర్భంగా అతడికి క్షమాపణలు చెప్పింది.

Published : 08 Jun 2023 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో అదా శర్మ (Adah Sharma) ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). ఈ చిత్రం విడుదలపై పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అదాశర్మ ఓ అభిమానికి క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతుండగా నెటజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

విడుదలై నెల అవుతున్నా ‘ది కేరళ స్టోరీ’కి సంబంధించి ఏదో వార్త రోజూ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. తాజాగా అదా శర్మ ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోల్‌కతాకు చెందిన ఓ అభిమాని ఈ సినిమా చూడాలని ఉందంటూ ట్వీట్‌ చేశారు. ‘‘నాకు రూ.500 పెట్టైనా టికెట్‌ కొనుక్కొని ఈ సినిమా చూడాలని ఉంది. కానీ కోల్‌కతాలో ఎక్కడా ఒక్క షో కూడా వేయడం లేదు. ఇక ఓటీటీ మాత్రమే మాకున్న ఏకైక ఆశ’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన అదా శర్మ.. ‘‘నన్ను క్షమించండి. ‘ది కేరళ స్టోరీ’పై నిషేధం ఎత్తివేసినా.. సినిమా ప్రదర్శన మా చేతిలో లేదు’’ అంటూ బాధగా ఉన్న ఎమోజీలను పోస్ట్‌ చేసింది. ఇక దీనిపై కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో త్వరగా రిలీజ్‌ చేయాలని కోరుతున్నారు.

మే5న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించింది. కలెక్షన్ల పరంగానూ రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జూన్‌ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని