Thirteen Lives review: రివ్యూ: థర్టీన్‌ లైవ్స్‌

Thirteen Lives review: రాన్‌ హోవర్డ్‌ తెరకెక్కించిన ‘థర్టీన్‌ లైవ్స్‌’ ఎలా ఉందంటే?

Updated : 25 Aug 2022 18:56 IST

చిత్రం: థర్టీన్‌ లైవ్స్‌; నటీనటులు: విగ్గో మార్టెన్‌సెన్‌, కోలిన్‌ ఫారెల్‌, జోయల్‌ ఎడ్జర్టన్‌,టామ్‌ బ్యాటీమెన్‌ తదితరులు; సంగీతం: బెంజిమిన్‌ వాల్‌ఫిష్‌; సినిమాటోగ్రఫీ: సయోబు ముఖదీప్‌ర్రం; ఎడిటింగ్‌: జేమ్స్‌ డి.విల్‌కాక్స్‌; రచన: డాన్‌ మాక్‌ఫర్సన్‌, విలియమ్‌ నికోల్సన్‌; దర్శకత్వం: రాన్‌ హోవర్డ్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

యథార్థ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. ఇందులో బయోపిక్‌లు, ఉగ్రదాడులు, విపత్తులు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఏ సంఘటననైనా ఎంత భావోద్వేగంగా తెరకెక్కించారన్న దానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. కోచ్‌తో పాటు 12మంది చిన్నారులు గుహలో చిక్కుకుపోయిన సంఘటన యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దాన్ని కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘థర్టీన్‌ లైవ్స్‌’ తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడు రాన్‌ హోవర్డ్‌ ఎలా తెరకెక్కించారు?

కథేంటంటే: థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్‌ రాష్ట్రంలోని థామ్ లువాంగ్ గుహలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఒకరోజు వాటిని చూడాలని 12మంది ఫుట్‌బాల్‌ టీమ్‌ పిల్లలు తమ కోచ్‌తో కలిసి ఆ గుహ లోపలికి వెళ్తారు. అదే సమయంలో నాన్‌ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గుహకు వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. మరోవైపు చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. మరి చిన్నారులు గుహ వద్దకు వెళ్లారని వారికి ఎలా తెలిసింది? వారిని కాపాడేందుకు థాయ్‌ ప్రభుత్వం ఏం చేసింది? పది కిలోమీటర్ల పొడవైన గుహలోకి రెస్క్యూ టీమ్‌ ఎలా వెళ్లింది? చిన్నారులందరూ సజీవంగా ఎలా ఉండగలిగారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: మనకు తెలిసిన, ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సంఘటన ఆధారంగా సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా థాయ్‌ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. ఒకటి కాదు, రెండు కాదు, 18 రోజుల తర్వాత చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు యావత్‌ ప్రపంచం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్న వ్యక్తి మృత్యువు అంచు వరకూ వెళ్లి ప్రాణాలతో బయటపడితే సాటి మనిషిగా ఆ వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆపదలో ఉన్నది చిన్నారులైతే  హ్యూమన్‌ ఎమోషన్స్‌ తారస్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలు మొదటి నుంచి చివరి వరకూ కొనసాగించి, ఆద్యంతం ఉత్కంఠగా ‘థర్టీన్‌ లైవ్స్‌’ తీర్చిదిద్దడంలో దర్శకుడు రాన్‌ హోవర్డ్‌ విజయం సాధించారు.

ఫుట్‌బాల్‌ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని వెళ్లడంతోనే నేరుగా కథ మొదలు పెట్టేశాడు దర్శకుడు. అక్కడి నుంచి వాళ్లు గుహలోకి వెళ్లడం, మరోవైపు భారీ వర్షం ఇలా ఒక్కోసన్నివేశం మనల్ని కథలోకి కాదు.. కాదు.. గుహలోకి తీసుకెళ్లిపోతుంది. నీటితో నిండిపోయిన గుహలో ఉన్న చిన్నారులను ఎలా కనిపెడతారు? అసలు వాళ్లు బతికే ఉన్నారా? లేదా? అన్నది ఎలా తెలుస్తుంది? ఇలా ప్రతి ప్రశ్న ప్రేక్షకుడిని మెదడును తొలిచేస్తుంది. ప్రతి సన్నివేశంలో ఆ ఇంటెన్షన్‌ను క్రియేట్‌ చేస్తూ దర్శకుడు కథను నడిపిన తీరు చాలా బాగుంది. సీడైవింగ్‌లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్‌ డైవర్లు ఎంతో శ్రమించి 9 రోజుల తర్వాత చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు పర్వతం పైనున్న రంధ్రాల నుంచి వర్షపు నీరు లోపలకి చేరకుండా చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. వరద నీరు పోయే మార్గం లేకపోతే, పంటపొలాల నుంచి నీరువెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు.  పిల్లల కోసం రైతులు తమ పంటలను వదులుకోవడం వంటి సన్నివేశాలు ఉద్విగ్నంగా ఉంటాయి.

పిల్లల్ని కనిపెట్టిన తర్వాతే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. బ్రిటిష్ డైవర్లు వాళ్లను సులభంగా తీసుకొచ్చేయొచ్చు కదా! అన్న ప్రశ్న ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ, అది అనుకున్నంత సాధ్యం కాదని, ఓ చిన్న సన్నివేశం ద్వారా దర్శకుడు చక్కగా చూపించాడు. ఒకవైపు ఆగని వర్షం, మరోవైపు గుహ వద్ద చిన్నారుల కోసం తల్లిదండ్రుల ఎదురు చూపులు ఇలా సినిమా మొత్తం ఎమోషన్‌ డ్రామాగా నడుస్తుంది. ‘కనీసం నా కుమారుడి శవాన్ని అయినా తీసుకుని రండి’ అంటూ ఓ చిన్నారి తండ్రి అక్కడి గవర్నర్‌ను అడిగే తీరు కంటతడి పెట్టిస్తుంది. అక్కడి నుంచి  థాయ్‌ ప్రభుత్వంతో కలిసి బ్రిటిష్‌ డైవర్లు తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ ఆశ్చర్యపరుస్తాయి. చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు చేసే ప్రతి ప్రయత్నం ఉత్కంఠగా ఉంటుంది.  ఏ సినిమా/కథ చూస్తున్న ప్రేక్షకుడైనా ‘హ్యాపీ ఎండింగ్‌’ కోరుకుంటాడు.  ‘థర్టీన్‌ లైవ్స్‌’ కూడా ఆ మజానే ఇస్తుంది. థ్రిల్లింగ్‌ మూవీలంటే మీకు ఇష్టమా ‘థర్టీన్‌ లైవ్స్‌’ మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు.  అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్రా ఆ పిల్లలను కాపాడాలను కోరుకుంటాం. నటీనటుల కన్నా కూడా సాంకేతిక విభాగం పనితీరు అద్భుతం. సయోబు ముఖదీప్‌ర్రం సినిమాటోగ్రఫీ హైలైట్‌. లువాంగ్‌ గుహలు, పర్వత ప్రాంతం, అండర్‌ వాటర్‌ సీన్స్‌ చాలా చక్కగా తీశారు. సన్నివేశాలకు అనుగుణంగా వాడిన లైటింగ్‌ ఎఫెక్ట్‌ చాలా బాగుంది. జేమ్స్‌ డి.విల్‌కాక్స్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. ఈ సినిమాకు మరో బలం బెంజిమిన్‌ వాల్‌ఫిష్‌ నేపథ్య సంగీతం. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. డాన్‌ మాక్‌ఫెర్సన్‌, విలియమ్‌ నికోల్సన్‌లు వాస్తవాలను ప్రతిబింబించేలా రాసిన తీరు, అంతే ఉత్కంఠగా, భావోద్వేగభరితంగా రాన్‌ హోవర్డ్‌ తెరకెక్కించిన తీరు చక్కగా ఉంది.

బలాలు

+ కథ, కథనాలు

+ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

+ రెస్క్యూ సీన్స్‌

బలహీనతలు

- అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు

చివరిగా: ‘థర్టీన్‌ లైవ్స్‌’.. ఉత్కంఠగా సాగే రెస్క్యూ ఆపరేషన్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని