Diwali movie release: ఈ దీపావళికి థియేటర్‌ దద్దరిల్లే చిత్రాలు.. మరి ఓటీటీలో..!

దసరా పండగకు బాక్సాఫీస్‌ వద్ద పలు పెద్ద  చిత్రాలు థియేటర్‌లో సందడి చేయగా, ఆ హంగామా దీపావళికి కూడా కొనసాగుతోంది. అయితే, ఈ సారి డబ్బింగ్‌ చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు/సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూసేయండి.

Published : 06 Nov 2023 09:50 IST

‘జపాన్‌’ మేడిన్‌ ఇండియా

వైవిధ్యమైన కథలు, పాత్రలతో తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటారు కథానాయకుడు కార్తి (Karthi). రాజు మురుగన్‌ దర్శకత్వంలో తాజాగా ఆయన నటించిన చిత్రం ‘జపాన్‌’ (Japan). అనుఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఇందులో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వాటి నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరోసారి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో..

రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ రూపొందిస్తున్న చిత్రం ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX). దీపావళి కానుకగా ఈ మూవీ కూడా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు.. ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు  ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్‌ తండ’.. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తుంటే, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.


ఇంటిల్లిపాదినీ మెప్పించేలా..

దినేశ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలు. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుంది. దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు తన కలతో ప్రేమించిన అమ్మాయికి చేరువయ్యే క్రమం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయి. మంచి అనుభూతిని పంచే ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.


దీపావళికి రాబోతున్న హాలీవుడ్‌ మూవీ..

‘ది మార్వెల్స్‌’ (The Marvels)...అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా. మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.  ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


అవార్డు విన్నింగ్‌ మూవీ..

పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం.. అప్పటిదాకా పెంచుకుంటున్న మేకను అతడి తాత బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అందమైన పల్లెటూరి కథ ‘దీపావళి’. రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రధారులుగా రా.వెంకట్‌ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ఇది. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో దీనిని తీర్చిదిద్దారు. ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరించారు. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


దీపావళి రోజునే థియేటర్‌లో సల్మాన్‌ సందడి..

‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు ఈ ఓటమిని ఒప్పుకోడు’ అంటున్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan). ఆయన కథానాయకుడిగా  మనీష్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌3’  (Tiger 3). కత్రినా కైఫ్‌  (Katrina Kaif) కథానాయిక.  ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ అదరహో అనేలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

 

  • అమెజాన్‌ ప్రైమ్‌
  • రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) నవంబరు 7
  • బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) నవంబరు 9
  • పిప్పా (హిందీ) నవంబరు 10
  • నెట్‌ఫ్లిక్స్‌
  • ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6
  • ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8
  • రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8
  • ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10
  • ఆహా
  • ది రోడ్‌ (తమిళం) నవంబరు 10
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) నవంబరు 8
  • విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8
  • లేబుల్‌ (తెలుగు) నవంబరు 10
  • జీ5
  • ఘూమర్‌ (హిందీ) నవంబరు 10
  • బుక్‌ మై షో
  • ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌)నవంబరు 7
  • యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 7
  • ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 10
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని