Venkatesh: ‘నారప్ప’ విడుదల వాయిదా

Corona Effect: వెంకటేశ్‌ ‘నారప్ప’ మే 14న రావడం లేదు..

Updated : 29 Apr 2021 13:03 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘నారప్ప’ విడుదల వాయిదా పడింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా ‘నారప్ప’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడెక్షన్స్‌ గురువారం తెలియజేసింది.

‘‘నారప్ప’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులు అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ సినిమా కోసం ఇష్టం, అంకితభావంతోనూ పనిచేసిన ప్రతిఒక్కరం కోరుకుంటున్నాం. ఇళ్లలోనే ఉండి మనపట్ల, మన కుటుంబసభ్యుల పట్ల అప్రమత్తంగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. అందరూ మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ, సమాజానికీ చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నిందర్నీ అలరించాలని కోరుకుంటున్నాం’ అని ‘నారప్ప’ టీమ్‌ పేర్కొంది.

కోలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అసురన్‌’ రీమేక్‌గా ‘నారప్ప’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన ప్రియమణి నటించారు. సమాజంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కుల వ్యవస్థ, దానివల్ల ఎదురయ్యే సమస్యలు గురించి తెలియజేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మణిశర్మ స్వరాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని