Yukti Thareja: ఆయనతో కలిసి డాన్స్‌ చేయాలని ఉంది: యుక్తి తరేజా

Yukti Thareja interview: తొలి సినిమానే తెలుగులో చేయడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పింది యుక్తి తరేజా. తెలుగు తెరపై సందడి చేయనున్న మరో ఉత్తరాది భామ ఈమె. ‘రంగబలి’ సినిమాలో నాగశౌర్యకి జోడీగా నటించింది.

Updated : 04 Jul 2023 14:26 IST

తొలి సినిమానే తెలుగులో చేయడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పింది యుక్తి తరేజా. తెలుగు తెరపై సందడి చేయనున్న మరో ఉత్తరాది భామ ఈమె. ‘రంగబలి’ సినిమాలో నాగశౌర్యకి జోడీగా నటించింది. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో... సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా యుక్తి తరేజా(YuktiThareja) హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

‘‘కథని ఎంతగా ఇష్టపడ్డానో... ఈ బృందం అంతకంటే ఎక్కువ నచ్చింది. ఈ అవకాశం రాగానే కథానాయకుడు నాగశౌర్య, నిర్మాణ సంస్థ గురించి తెలుసుకున్నా. కథానాయికగా పరిచయం కావడానికి తగిన బృందం, తగిన సినిమా అనిపించింది. అంతకుముందు ఇమ్రాన్‌ హస్మీతో కలిసి చేసిన ‘లుట్‌ గయే... ’ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాటే ‘రంగబలి’లో అవకాశానికి కారణమైంది. దర్శకుడు పవన్‌ ఈ పాత్ర కోసం మొదట నన్ను ఆడిషన్స్‌ చేశారు. లుక్‌ టెస్ట్‌ తర్వాత, రెండు సన్నివేశాలు ఇచ్చి నటించమని కోరారు. ఆ తర్వాతే ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాతో నటన పరంగా  ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా’’.

* ‘‘నా పాత్ర పేరు సహజ. వైద్య విద్యార్థినిగా కనిపిస్తా. ఆ పేరుకు తగ్గట్టుగానే సహమైన పాత్ర. అదే నాకు నచ్చింది. కూల్‌గా ఉంటూ, ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకునే ఓ అమ్మాయి. వ్యక్తిగతంగా నాకూ, ఆ పాత్రకి చాలా దగ్గరి పోలికలే ఉంటాయి.  అయితే ఈ పాత్ర కోసం పాండిచ్చేరిలో వైద్య విద్యని అభ్యసిస్తున్న నా సోదరి దగ్గరికి వెళ్లి కొన్ని రోజులు గడిపా. అది నాకు చాలా మేలు చేసింది’’

* ‘‘నా మాతృభాష హిందీ. తెలుగులో నటిస్తున్నప్పుడు భాష పరంగా చాలా సమస్యలే ఎదురయ్యాయి. కానీ దర్శకుడు పవన్‌ ముందే స్క్రిప్ట్‌ ఇవ్వడం, దర్శకత్వ బృందం సాయం చేయడంతో ముందే సన్నద్ధమై సంభాషణలు చెప్పేదాన్ని. నాగశౌర్యతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. 20కిపైగా సినిమాలు చేసిన ఓ హీరోతో కలిసి నటిస్తున్నానని తెలిసినప్పుడు మొదట భయపడ్డా. కానీ సెట్లో ఆయన  ఎంతో కలివిడిగా ఉంటూ సహకారం అందించారు. సినిమాకి ముందు నాగశౌర్య గురించి ఎంతగా విన్నానో, అంతకంటే గొప్ప వ్యక్తిత్వాన్ని సెట్లో చూశా’’.

* ‘‘మాది హరియాణ. దిల్లీ విశ్వవిద్యాలయంలో  వాణిజ్యశాస్త్రం డిగ్రీ చదివా. చిన్నప్పట్నుంచీ చదువుల్లో  చురుగ్గా ఉండేదాన్ని. దిల్లీ విశ్వవిద్యాలయంలో చేరాక నా  జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్‌ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. తర్వాత నటనవైపు వచ్చా.

* హరియాణలో ఉన్నప్పుడే నేను తెలుగు సినిమాలు చూసేదాన్ని తెలుగులో నాకు ఇష్టమైన హీరో అంటే అల్లు అర్జున్‌. ఆయనతో కలిసి డాన్స్‌ చేయాలని ఉంది. కథానాయికల్లో అనుష్కశెట్టి అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో మరిన్ని కొత్త కథలు వింటున్నా. ఈ సినిమా తర్వాతే కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని