తెలుగు భాషా, సంస్కృతి వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి

Published : 26 Oct 2021 20:23 IST

న్యూదిల్లీ: అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. 2020 అక్టోబరులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి(సింగపూర్), తెలుగు మల్లి(ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య(యూకే), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక( జొహానెస్ బర్గ్) సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను ‘సభావిశేష సంచిక’ పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

సాహితీ సదస్సును, పుస్తకాన్ని అమరగాయకుడు ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని కితాబిచ్చారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను తాను ఆకాంక్షిస్తున్నామని, వాటిని ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని వెంకయ్యనాయుడు సూచించారు. పుస్తక సంపాదకులైన వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, రచయితలకు, ప్రచురణకర్తలకు అభినందనలు తెలిపారు.

ఈ ఆవిష్కరణ మహోత్సవానికి రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్‌బోర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లాండ్‌), శాయి రాచకొండలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు.

ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదికలో జరిగిన ‘సభా విశేష సంచిక’ డయాస్పోరా తెలుగు కథానిక -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంథాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలంలో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని