US Visa: ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థి, పర్యాటక వీసాలు

ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరిస్తామని, అది మునుపటి ఏడాది రికార్డులను అధిగమిస్తుందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ పేర్కొన్నారు.

Updated : 11 Jun 2022 10:18 IST

తొలిసారి దరఖాస్తు చేసుకునే వారికి సెప్టెంబరు నుంచి ఇంటర్వ్యూలు
నవంబరు తర్వాత కొత్త కాన్సులేట్‌ భవనం నుంచి కార్యకలాపాలు
‘ఈనాడు’తో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరిస్తామని, అది మునుపటి ఏడాది రికార్డులను అధిగమిస్తుందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ పేర్కొన్నారు. పర్యాటక వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఇంటర్వ్యూలు  ప్రారంభిస్తామని తెలిపారు. అమెరికా-భారత్‌ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని అమెరికా కంపెనీల్లో తెలుగు రాష్ట్రాల్లోని లక్ష మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. త్వరలో పదవీ విరమణ పొందనున్న ఆయన శుక్రవారం ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.

విద్యార్థి వీసాలకు గిరాకీ అధికంగా ఉంది? దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.?
విద్యార్థి వీసాలకు దరఖాస్తులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా గతంలో ఎక్కువగా ఇవ్వలేకపోయాం. గతేడాది 1.20 లక్షల వరకూ పరిష్కరించాం. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువ. ప్రస్తుతం సంవత్సరంలో గడిచిన ఏడాది రికార్డును అధిగమిస్తామన్న ఆశాభావంతో ఉన్నాం. దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల్లో వీలైనంత ఎక్కువ మందికి వీసాలు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.

పర్యాటక వీసాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు? వారికి ఎప్పట్నుంచి ఇచ్చే అవకాశం ఉంది?
గడిచిన రెండు, మూడేళ్లుగా పర్యాటక(బీ1/బీ2) వీసాలను పెద్దగా ఇవ్వలేకపోయాం. ఇకపై విద్యార్థి, పర్యాటక వీసాల స్లాట్లను క్రమంగా పెంచాలని నిర్ణయించాం. తొలిసారి అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. దరఖాస్తులు పరిష్కారమవుతున్నకొద్దీ స్లాట్లు పెంచుతూ పోతాం.

వీసా పునరుద్ధరణకూ ఎక్కువ సమయం తీసుకుంటోంది? ఈ సమస్యను అధిగమించేందుకు ఏదైనా మార్గం ఉందా?
పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకునే వారు వీసా ఇంటర్వ్యూ మినహాయింపు సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. వీసా కాలం చెల్లి 48 నెలల లోపైతే ఈ మినహాయింపునకు అర్హులే. పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హులా? కాదా? అనేది స్పష్టమవుతుంది. అధిక శాతం మంది మినహాయింపు లభించే అవకాశం ఉంది. పునరుద్ధరణ కోసం డ్రాప్‌ బాక్స్‌ సదుపాయాన్నీ వినియోగించుకోవచ్చు.

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి?
రెండు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రెండు దేశాల మధ్య 20 బిలియన్‌ డాలర్ల స్థాయిలో వాణిజ్యం ఉండేది. ప్రస్తుతం 160 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది. ఆపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ సంస్థలు అమెరికా వెలుపల అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేశాయి. అమెరికా కంపెనీల్లో హైదరాబాద్‌లో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

నూతన కాన్సులేట్‌ భవన సముదాయం నుంచి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
నవంబరు నాటికి పనులు పూర్తవుతాయి. ఆ తరవాత ఎప్పుడైనా కార్యాలయాన్ని అక్కడికి మారుస్తాం. అది ప్రారంభమైతే వీసా ఇంటర్వ్యూ విభాగాలు(వీసా విండోస్‌) 14 నుంచి 54కు పెరుగుతాయి. సిబ్బంది కోసం 255 డెస్క్‌లు(ప్రస్తుతం 150 ఉన్నాయి) ఏర్పాటు చేస్తున్నాం. దశల వారీగా సిబ్బందినీ పెంచుతాం.

భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
ఈ నెలలోనే పదవీ విరమణ చేయబోతున్నా. తర్వాత వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్శిటీలోని ది ఐసెన్‌ హూవర్‌ స్కూల్‌ ఆఫ్‌ నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ రిసోర్స్‌ స్ట్రాటజీ విభాగంలో అధ్యాపకుడిగా సేవలు అందిస్తా. తెలంగాణలోని డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌కు.. అమెరికాలోని నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్శిటీతో ఉన్న పరస్పర మార్పిడి పథకాన్ని (ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌) కొనసాగించడం ద్వారా తెలంగాణతో నా సంబంధాలు కొనసాగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని