ప్రవాసుల కష్టాలకో పరిష్కారం ‘రెడియో’

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారితోపాటు, చదువు, ఉద్యోగ రీత్యా పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రవాసులకు స్థానికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా కార్మికులుగా వెళ్లిన వారు, ప్రత్యేకించి గల్ఫ్‌ ప్రాంతాలకు వెళ్లిన వారు

Updated : 20 Jun 2022 05:25 IST

 విదేశాల్లోని బాధితులకు అండగా ఓ సంస్థ

దౌత్యవేత్త ధ్యానేశ్వర్‌ మూలే నేతృత్యం

పలు దేశాల్లో వాలంటీర్ల ద్వారా 24 గంటలూ సేవలు

ఈనాడు హైదరాబాద్‌: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారితోపాటు, చదువు, ఉద్యోగ రీత్యా పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రవాసులకు స్థానికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా కార్మికులుగా వెళ్లిన వారు, ప్రత్యేకించి గల్ఫ్‌ ప్రాంతాలకు వెళ్లిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, పరాయి దేశంలో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తుల నుంచే శారీరక, మానసిక వేధింపులు, అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి తిండి, నివాసం లేక వీధినపడటం, ప్రమాదాలకు గురై వైద్యం అందకపోవడం, చిన్నచిన్న నేరాలకే జైలుపాలై బయటకొచ్చే మార్గంలేక అక్కడే మగ్గిపోవడం వంటి వాటితో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు రెడియో(రెస్క్యూయింగ్‌ ఎవ్రీ డిస్ట్రెస్‌డ్‌ ఇండియన్‌ ఓవర్‌సీస్‌) అనే సంస్థ ముందుకు వచ్చింది. దౌత్యవేత్త, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడిగా ఉన్న ధ్యానేశ్వర్‌ మూలే దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ‘ఇప్పటికే 18 దేశాల్లో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థకు అంతర్జాతీయంగా 20 మంది సలహాదారులున్నారని, ఏర్పాటైన ఏడాదిన్నర కాలంలోనే యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా తదితర దేశాల్లో చాలామంది బాధితులకు అండగా నిలిచామని’ ఆయన చెబుతున్నారు.

అత్యవసర సాయమే లక్ష్యం

విదేశాల్లో ఉపాధికోసం వెళ్లి ఇబ్బందుల్లో పడే వారిని ఆదుకోవడానికి 2009లో విదేశీ మంత్రిత్వశాఖ ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఫండ్‌(ఐసీడబ్ల్యూఎఫ్‌)ను ఏర్పాటుచేసింది. దాని ద్వారా బాధితులకు తాత్కాలిక వసతి కల్పించడం, న్యాయ సహాయం, అత్యవసర వైద్యం తదితర కార్యక్రమాలు చేపడుతోంది. అయితే బాధితులు ఎక్కువ మంది ఈ సాయం పొందలేకపోతున్నారు. ‘‘అత్యవసర సమయాల్లో ఐసీడబ్ల్యూఎఫ్‌ రంగంలోకి దిగేవరకు బాధితులు ఎదురుచూడాల్సి వస్తుంది. వీరి వద్ద ఉన్న సిబ్బందీ పరిమితం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ‘రెడియో’ ఏర్పాటైంది’’ అని నిర్వాహకులు తెలిపారు. సంస్థ తరఫున విదేశాల్లో ప్రత్యేకంగా సలహాదారులను, వాలంటీర్లను నియమించుకోవడం ద్వారా భారత విదేశీ మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుంటూ బాధితులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. ‘‘సౌదీలోని జెడ్డా నగరంలో నిర్బంధానికి గురైన భారత పౌరులను విడుదల చేయించడంతోపాటు వారు స్వదేశానికి చేరడానికి అవసరమైన ఏర్పాట్లుచేసినట్టు’’ రెడియో గ్లోబల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ధనశ్రీ పాటిల్‌ తెలిపారు. పలువురు కార్మికులు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి వీలుగా పాస్‌పోర్టులు ఇప్పించడం, ఇండియన్‌ మిషన్‌ నుంచి అత్యవసర సర్టిఫికెట్లు వచ్చేలా చూడటం వంటివీ చేసినట్లు వివరించారు. ‘‘ఇటీవల దుబాయ్‌కు సర్వెంట్‌గా వెళ్లి అనధీకృత ఏజెంట్‌ మోసానికి గురైన మహిళను రక్షించాం. ఇలా అనేక మందికి అండగా నిలుస్తోన్న సంస్థ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని’’ ధనశ్రీ పాటిల్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో 4,820 మంది భారతీయ విద్యార్థులకు సాయపడినట్టు వివరించారు.

అన్ని వేళలా అండగా నిలిచేందుకే

- ధ్యానేశ్వర్‌ మూలే

ఉపాధి కోసం వివిధ వృత్తుల వారు లక్షల్లోనే విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ మోసాలకు గురై కొందరు, తెలిసో తెలియకో పొరపాట్లు చేసి మరికొందరు ఇబ్బందుల్లో పడుతున్నారు. అలాంటి వారికి భరోసా ఇవ్వడమే సంస్థ లక్ష్యం.గతంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అందించిన సాయం ఆధారంగా అన్ని దేశాల్లో సలహాదారులను ఎంపిక చేస్తున్నాం. వీరంతా ఆయా దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడంతోపాటు భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటారు.


ఎలా సంప్రదించాలి
 రెడియో హెల్ప్‌లైన్‌ నంబరు-9503107419,
 మెయిల్‌-
redio.help@gmail.com

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని