ఖతార్‌లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు

ఖతార్‌లో ఎన్నికల శంఖారావం సభ ఎన్నారై తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Published : 02 Mar 2024 17:19 IST

ఖతార్‌లో ఎన్నికల శంఖారావం సభ ఎన్నారై తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రవాసులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన సభలో.. తెదేపా, జనసేన నేతల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

ఖతార్ తెలుగుదేశం అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ.. తమ పార్టీ ఖతారు విభాగం అందించిన సేవలను గుర్తుచేశారు. ఆపదలో ఉన్న 17 మందికి వైద్య సాయం అందించడంలో సహకరించిన వారికి, ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటుకు తోడ్పడిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఎన్నికలలో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకమని.. తమ జన్మభూమి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.  తెలుగుదేశం / జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.

జనసేన కన్వీనర్‌ జీకే దొర మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కల్యాణ్‌ అడుగుజాడల్లో నడిచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే ఎన్నికలు కనివినీ ఎరుగని రీతిలో జరుగుతాయని.. అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన ఆవిర్భావం చారిత్రక అవసరాన్ని గుర్తుచేశారు.

ఎన్నారై తెదేపా ఉపాధ్యక్షులు మద్దిపోటి నరేశ్‌, జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, ఆంజనేయులు ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికలలో ప్రవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వారందరినీ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని అభ్యర్థించారు. ఒకసారి చేసిన తప్పునకు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని.. ఈసారి అదే తప్పు చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో మట్టికూడా మిగలదని హెచ్చరించారు. 

జనసేన కన్వీనర్‌ సత్యం మెడిది, సీనియర్ సభ్యులు వీరబాబు లోవిశెట్టి, సుధాకర్ నందిగాము, మల్లికార్జున, గౌతమ్, అనిల్, నగేష్ తదితరులు మాట్లాడుతూ.. తెలుగుదేశం-జనసేన బంధం శాశ్వతమన్నారు.  ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. వాటిని తిప్పికొట్టడానికి తాము సిద్ధమని పేర్కొన్నారు. హలో ఏపీ.. బై బై వైసీపీ అని నినదించారు.

ఎన్నారై తెదేపా ప్రధాన కార్యదర్శి రవి పొనుగుమాటి, ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ రమేష్ దాసరి, రవీంద్ర, రజని, నాయుడు, రమణ కుమార్, సాయి మోహన్ వారాధి తదితరులు ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికల కదనరంగంలో తమ సత్తా చాటటానికి ప్రవాసులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర భవితకు, భావిపౌరుల భవిష్యత్తుకు సంబంధించినవని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ కల సిద్ధమవ్వాలంటే కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌ కృష్ణార్జునులై కౌరవసేన వైకాపాను తుదముట్టించి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడతారని.. వారికి మనం చేయూతనిచ్చి అండగా నిలవాలని కోరారు.

సభా నిర్వహణలో సహకరించిన సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, రవి పొనుగుమాటి, సాయి మోహన్, రమేష్ దాసరి, రవీంద్ర, రజని, కల్యాణ్‌ తదితరులకు నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. జై తెదేపా, జై జనసేన నినాదాలతో సభను దిగ్విజయంగా ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని