‘చంద్రమోహనునికి ప్రపంచవ్యాప్తంగా ఘన నివాళి’

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌కు వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.

Published : 05 Dec 2023 19:57 IST

సింగపుర్‌: ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌కు వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శనివారం వర్చువల్‌గా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు పాల్గొని ఆయన సినీరంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చంద్రమోహన్‌ కుటుంబ సభ్యులు, ఆప్తులు, వివిధ దేశాల తెలుగు సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రమోహన్‌ నటనా విశిష్టతను, ఆయన వ్యక్తిత్వాన్ని అనేక విషయాలను పంచుకున్నారు.

చంద్రమోహన్‌తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. చంద్రమోహన్, ఆయన సతీమణి జలంధరతో తనకున్న స్నేహాన్ని వివరించారు. తాను తొలి పాటను చంద్రమోహన్‌కే రాశానన్నారు. చంద్రమోహన్ మేనల్లుడు, సినీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. తన మామయ్య ఉన్నత వ్యక్తిత్వాన్ని, ఆదిత్య 369 సినిమా అనుభవాలు, పలు అంశాలను షేర్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు డాక్టర్‌ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్‌ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం వంశీ ప్రచురణగా చంద్రమోహన్‌ నటనా వైదుష్యాన్ని తెలియజేస్తూ 120 సినిమా సమీక్ష వ్యాసాలతో ప్రచురించిన సినీతెర చంద్రమోహనం పుస్తకం గురించి, ఆ కార్యక్రమాల్లో చంద్రమోహన్‌ పాల్గొని పంచుకున్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కళాతపస్వి కె. విశ్వనాథ్  తనయుడు చంద్రమోహన్‌కు బంధువు అయిన కాశీనాథుని నాగేంద్ర మాట్లాడుతూ.. తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంస్మరణ సభకు రాధిక మంగిపూడి నిర్వహణ బాధ్యతలు చూడగా.. అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, హైదరాబాద్‌ నుంచి హాస్యబ్రహ్మ శంకర నారాయణ,  ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి,  ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, కువైట్ నుంచి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుంచి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొని చంద్రమోహన్‌కు ఘన నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని