డాలస్‌లో సందడిగా ‘టీపాడ్‌’ వనభోజనాలు

తెలుగువారి వనభోజనం డాలస్‌లోనూ సందడి చేసింది. మనం మరిచిపోతున్న సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కొత్త అనుభూతుల రుచి చూపింది. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేసింది.

Published : 31 May 2022 00:13 IST

ఫ్లాష్‌మాబ్‌లో పాల్గొన్న జనం

అమెరికా: తెలుగువారి వనభోజనం డాలస్‌లోనూ సందడి చేసింది. మరిచిపోతున్న సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కొత్త అనుభూతుల రుచి చూపింది. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేసింది. ఏటా వేలాదిమందితో బతుకమ్మ పండుగను విశేషంగా నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన ‘డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి’ (తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డాలస్‌- టీపాడ్‌) ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. అర్గిల్‌లోని పైలట్‌నాల్‌ పార్క్‌లో ఆదివారం టీపాడ్‌ నిర్వహించిన ఈ వనభోజనాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. డాలస్‌, టెక్సాస్‌ పరిధిలో నివాసముంటున్న సుమారు మూడువేల మంది తెలుగువారు హాజరై తెలంగాణ వంటకాలను రుచి చూసి మైమరిచిపోయారు. ఈ వేడుక ఆరంభంలో స్థానిక కళాకారుల బృందం ‘డాలస్‌ పరై కుజు’ ప్రదర్శించిన డప్పు డ్యాన్స్‌ ఉర్రూతలూగించింది. అనంతరం తెలుగు వారందరూ ఫ్లాష్‌మాబ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు పతంగులను ఎగురవేశారు. లెమన్‌ స్పూన్‌ తదితర ఆటలను ఆస్వాదించారు. పెద్దలు టగ్‌ ఆఫ్‌ వార్‌ లాంటి ఆటలాడి తాము మరచిపోతున్న గతానుభూతులను నెమరువేసుకున్నారు. ముఖానికి పెయింటింగ్‌తో పిల్లలు, పెద్దలు చాలా ఉత్సాహంగా గడిపారు. భోజనాలు, ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమాన్ని టీపాడ్‌ ఫౌండేషన్‌ కమిటీ చైర్‌ అజయ్‌రెడ్డి, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రాని పంచెర్పుల, ప్రెసిడెంట్‌ రమణ లష్కర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవి లోకిరెడ్డి, ట్రస్టీలు లింగారెడ్డి అల్వా, రఘువీర్‌ బండారు, మాధవి సుంకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, మంజుల తొడుపునూరి విజయవంతంగా నిర్వహించారు. 

వనభోజనాలు నిర్వహించిన టీపాడ్‌ బృందం

ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వనభోజనాలకు వెళ్లే సంస్కృతి తగ్గిపోయిందని, కానీ ఇక్కడ చాలా గొప్పగా ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులకు కితాబునిచ్చారు. పిల్లల కోసం తల్లిదండ్రులు అమెరికా వచ్చారంటే నాలుగు గోడలకే పరిమితమవ్వాల్సి ఉంటుందన్న అపవాదును చెరిపివేశారని, ఇక్కడ ఇంతమందితో కలిసి వనభోజనాలకు హాజరవ్వడం తనకెంతో తృప్తినిచ్చిందంటూ చెమర్చిన కళ్లతో నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 

 వనభోజనాలకు హాజరైన వారు ఇలా ఉత్సాహంగా..

 
డాలస్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్టు టీపాడ్‌ నిర్వాహకులు ప్రకటించారు. అలెన్‌లోని అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో, డాలస్‌ హిందూ కమ్యూనిటీ సహకారంతో జూన్‌ 25న స్వామి వారికి, అమ్మవార్లకు వైభవంగా వివాహమహోత్సవం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తారని, హాజరైన వారందరికీ తిరుమల వెంకన్న ప్రసాదంతో పాటు వస్త్రాన్ని అందజేయనున్నట్టు టీపాడ్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

పిల్లలకు బహుమతులు అందజేస్తున్న టీపాడ్‌ ప్రతినిధులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని