ఉత్సాహంగా తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య సభ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

Published : 27 Nov 2023 16:51 IST

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాలం వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ పరంపరలో భాగంగా నవంబర్‌ 26న ‘నేటి బాల రచయితలే - రేపటి మేటి రచయితలు’ పేరిట నిర్వహించిన 62వ సాహిత్యసభ విజయవంతమైంది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ కార్యక్రమంలో బాల రచయితలకు, విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. బాల రచయితల్ని ప్రోత్సహించడంలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.  ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ బాల, యువ రచయితలు ఇంత చిన్న వయస్సులో కథలు, కవితలు, పద్యాలు, శతకాలు, నవలలు స్వతహగా రాయడం, తెలుగు సాహిత్యంపై ఎంతో పట్టు కలిగి ఉండటం, ఎంతో పరిణితితో కూడిన ప్రసంగాలు చేయడం అద్భుతమన్నారు. వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. వీరిని ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డా. పత్తిపాక మోహన్,  విశిష్ట అతిథిగా బాల వికాసవేత్త గరిపెల్ల అశోక్, ప్రత్యేక అతిథులుగా పుల్లా రామాంజనేయులు (ఉపాధ్యాయుడు, లక్ష్మీపురం, కర్నూలు జిల్లా); పసుపులేటి నీలిమ (ఉపాధ్యాయురాలు, కర్నూలు); డా. నెమిలేటి కిట్టన్న (ఉపాధ్యాయుడు, తిరుపతి);  భైతి దుర్గయ్య (ఉపాధ్యాయుడు, రామునిపట్ల, సిద్ధిపేట జిల్లా); చింతకుంట కిరణ్ కుమార్ (ఉపాధ్యాయుడు, పానుగల్, వనపర్తి జిల్లా); ప్రవీణ్ కుమార్ శర్మ (ఉపాధ్యాయుడు, తడపాకల్, నిజామాబాద్) పాల్గొని యువతరంలో తెలుగుభాష పట్ల అనురక్తి, రచనాసక్తి కల్గించడానికి ఏయే మార్గాలు అనుసరించాలనే సూచనలు, సలహాలు ఇచ్చి చక్కని మార్గనిర్దేశం చేశారు. 

ఈ క్రింద పేర్కొన్న బాల / యువ రచయితలు ఈ సమావేశంలో పాల్గొని తాము సృష్టించిన సాహిత్య వివరాలను, తమకు శిక్షణ ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తామింకా అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. షేక్ రిజ్వాన (ఇంటర్ ద్వితియ, ఖమ్మం); లక్ష్మీ అహాల అయ్యలసోమయాజుల (7వ తరగతి, హైదరాబాద్); బండోజు శ్రావ్య (బీటెక్ ఫస్ట్‌ ఇయర్‌, సిద్ధిపేట); శీర్పి చంద్రశేఖర్ (బీబీఏ ప్రథమ సంవత్సరం, అనంతపురం); విఘ్నేశ్ అర్జున్ (ఇంటర్ ప్రథమ సంవత్సరం, హన్మకొండ); కల్పన (బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌, అనంతపురం); అనుముల కృష్ణవేణి (బి.కామ్‌ తృతీయ సంవత్సరం, హైదరాబాద్); గీస శ్రీజ (పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం, ఆదిలాబాద్); డేగల వైష్ణవి (ఇంటర్ ప్రథమ సంవత్సరం, నిజామాబాద్); వేల్పుల శ్రీలత (9వ తరగతి, పెద్దపల్లి); వలిపే రాంచేతన్ (9వ తరగతి, మేడ్చల్); పుల్లా మురళీ ఆకాష్ (బీఎస్సీ తృతీయ సంవత్సరం, కర్నూలు); కొండపల్లి ఉదయ్ కిరణ్ (ఇంజనీరింగ్ డిప్లమా, సంగారెడ్డి); శ్రీరాములు కుమారి (ఇంటర్ ప్రథమ సంవత్సరం, బొల్లారం); కొంపల్లి విశిష్ట (9వ తరగతి, సిద్ధిపేట). ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ తానా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని