TANA: తానా ఆధ్వర్యంలో సినారె ‘విశ్వంభర’ సంబురం

తానా సాహిత్య విభాగం ‘తానా సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Updated : 02 Feb 2024 18:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘తానా సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసారి సినారె ‘విశ్వంభర’ సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు అతిథులను ఆహ్వానించి స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. 

సభ ప్రారంభకులుగా తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య హాజరై సి.నారాయణరెడ్డి (సినారె) జీవనరేఖలను.. విద్యార్థి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను వివరించారు. తానా సాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. సినారె కలం నుంచి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ్‌ పురస్కారం దక్కడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయమన్నారు. ఆ కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జె.కె. భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణ రూపంలో తీసుకురావడం హర్షదాయకమని చెప్పారు.

తెలుగు భాషా సాహిత్య వికాసాల కోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని నిరంజన్ శృంగవరపు చెప్పారు. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని జె.కె.భారవి ఆడియో రూపంలో తీసుకురావడం ముదావహమని కొనియాడారు. దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదిక ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉన్నారు. జె.కె. భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, శ్రవణానందకరంగా ఉందని సినీ కథారచయిత చిన్నికృష్ణ తెలిపారు. దీన్ని వీడియో రూపంలో తన సొంత ఖర్చులతో తీసుకువచ్చే ఆలోచన ఉందని.. త్వరలోనే ఈ విషయంపై సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. 

సినారె విశ్వంభర కావ్యాన్ని ఎన్నో సార్లు చదివానని.. ఎంతో ఆసక్తితో వ్యయ ప్రయాసలకోర్చి అత్యున్నత ప్రమాణాలతో ఆడియో రూపంలో రూపొందించినట్లు జె.కె. భారవి చెప్పారు. దీన్ని ఇప్పుడు తానా ప్రపంచసాహిత్యవేదిక ద్వారా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, తానా మాజీ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ల రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి.. అందులోని లోతుపాతుల్ని విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను ఆవిష్కరించారు.

'విశ్వంభర' కావ్యం ఆడియో కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని