Hasini Suryadevara: భారత్‌ కోసం 11ఏళ్ల చిన్నారి ఫండ్ రైజింగ్

యునిసెఫ్‌ చేస్తోన్న నిధుల సమీకరణకు సహాయం చేసేందుకు అమెరికాలో స్థిరపడిన ఓ 11ఏళ్ల చిన్నారి హాసిని సూర్యదేవర, తనవంతు కృషి చేస్తోంది.

Updated : 09 Sep 2021 20:47 IST

యునిసెఫ్‌కు మద్దతుగా విరాళాల సేకరణ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో యావత్‌ దేశం వణికిపోయింది. ఆ సమయంలో వైద్య ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగడంతోపాటు చాలాచోట్ల కొవిడ్‌ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌కు తోడ్పాటు అందించేందుకు UNICEFతో పాటు ఇతర భాగస్వామ్య సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, టెస్టింగ్‌ పరికరాలతో పాటు పీపీఈ కిట్ల వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం యునిసెఫ్‌ చేస్తోన్న నిధుల సమీకరణకు సహాయం చేసేందుకు భారత సంతతికి చెందిన ఓ 11ఏళ్ల చిన్నారి హాసిని సూర్యదేవర తనవంతు కృషి చేస్తోంది. అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి నిధులు సేకరించేందుకు (Fundraising) ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది.

అమెరికాలోని నెవడా రాష్ట్రం, రెనో ప్రాంతంలో నివసిస్తున్న హాసిని సూర్యదేవర, ఆమె సోదరుడు రిషాన్‌తో కలిసి GoFundMe వేదిక ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత్‌లో తమ కుటుంబీకులతో పాటు స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అందుకే వారికి సహాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని హాసిని సూర్యదేవర పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికా, ఇతర దేశాల్లో ఉంటున్న వారు ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

కేవలం కరోనా సమయంలోనే కాకుండా ఉత్తర నెవాడాలో పేద చిన్నారులను ఆదుకునేందుకు కూడా ఫుడ్‌ బ్యాంక్‌ (Food Bank) కోసం హాసిని ఇదివరకు విరాళాలు సేకరించారు. హాసిని, ఆమె సోదరుడితో కలిసి 2165 డాలర్లను సేకరించారు. ఇందుకోసం స్వయంగా రూపొందించిన కళాకృతులను హాసిని విక్రయించారు. చిన్నారులకు సహాయపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు హాసిని పలు స్వచ్ఛంద సంస్థల గుర్తింపు కూడా పొందారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చిన్నారులను యూత్‌ సర్వీస్‌ అమెరికా (YSA) గుర్తించింది. అలా గుర్తించిన 106 మందిలో హాసిని కూడా ఒకరు కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని