ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం: అమిత్ షా, చంద్రబాబు, పవన్‌

ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దకాలం నాటి ఎన్నికల ముఖచిత్రం తిరిగి పునరావృతమైంది.

Updated : 19 Mar 2024 13:21 IST

అమరావతి: ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దకాలం నాటి ఎన్నికల ముఖచిత్రం తిరిగి పునరావృతమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి కట్టుగా ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం - భాజపా - జనసేన పార్టీలు.. మళ్లీ జతకట్టాయి. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ముఖ్యనేతల స్పందనలు ఇలా ఉన్నాయి.

ఎన్డీయే బలమైన రాజకీయ వేదిక: అమిత్‌ షా

తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ తెదేపా, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను కూటమిలోకి స్వాగతిస్తున్నామన్నారు. మోదీ దార్శనికత, నాయకత్వంలో ఎన్డీయే బలమైన రాజకీయ వేదికగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉంది: చంద్రబాబు

ఏపీ, దేశానికి సేవ చేయడం కోసమే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికే సమయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. తెలుగు ప్రజల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందన్నారు. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు చరిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు.

వైకాపా అరాచకాలకు.. మోదీ నాయకత్వంలో ముగింపు పలుకుదాం: పవన్‌

తమను ఎన్డీయేలో భాగం చేసినందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఉగ్రవాదం, అవినీతి, ఇసుక, సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియా, దేవాలయాల అపవిత్రత, ఎర్ర చందనం స్మగ్లింగ్‌, బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై భౌతిక దాడులు, న్యాయ వ్యవస్థను కించపర్చడం, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం, దళితులపై అఘాయిత్యాలు.. ఇలా ఎన్నో వైకాపా పాలనలో కొనసాగాయి. చివరకు భాజపా - తెదేపా - జనసేన కూటమి, ప్రధాని మోదీ నాయకత్వంలో వీటికి ముగింపు పడుతుంది. మమ్మల్ని ఎన్డీయేలో భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేమంతా  మీ మార్గదర్శకత్వంలో పనిచేయడానికి, రాష్ట్ర ప్రజల కష్టాలు, బాధలను అంతం చేయడానికి ఎదురు చూస్తున్నాం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని