Lok Sabha: కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది: లోక్‌సభలో ఎంపీ నామా

తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష చూపిస్తోందని భారాస ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. నవోదయ విద్యాలయాల కోసం ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

Updated : 09 Aug 2023 15:58 IST

దిల్లీ: తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష చూపిస్తోందని భారాస ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. నవోదయ విద్యాలయాల కోసం ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా అని అని నిలదీశారు. ఈ మేరకు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా నామా నాగేశ్వరరావు మాట్లాడారు.

‘‘హర్‌ ఘర్‌ జల్‌ ఫథకం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తోంది. ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంటింటికీ మంచినీరు ఇస్తోందా? సాగుకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమించింది. రాష్ట్రానికి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏళ్లుగా కోరుతున్నాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగాం. కోచ్‌ ఫ్యాక్టరీలను మహారాష్ట్ర, గుజరాత్‌కు ఇచ్చి మాకు రిపేర్‌ ఫ్యాక్టరీ ఇచ్చారు. తెలంగాణలో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరాం. తెలంగాణకు మెడికల్‌ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వట్లేదు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది. చిన్న రాష్ట్రాల పట్ల మోదీ సర్కారు తీరు సరిగా లేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని లోక్‌సభలో నామా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని