పట్టభద్రుల తిరుగుబాటు

రాష్ట్ర రాజకీయాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.

Updated : 18 Mar 2023 07:04 IST

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రభుత్వ వ్యతిరేకత
ఉత్తరాంధ్రలో తెదేపాకు వైకాపా కన్నా 14.39% ఆధిక్యం
తూర్పు రాయలసీమలో 10.78% పైగా ఆధిక్యం
సీమ పశ్చిమ నియోజకవర్గంలో హోరాహోరీ
9 జిల్లాల్లోని 108 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ల భాగస్వామ్య ఎన్నికలివి..
అంగ, అర్థ, అధికార బలమున్నా వైకాపాకు ప్రతికూల పవనాలు
ఈనాడు - అమరావతి

రాష్ట్ర రాజకీయాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గ్గంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఘన విజయం సాధించగా.. తూర్పు రాయలసీమలో ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు. మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా, తెదేపా మధ్య తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం హోరాహోరీగా ఉంది. తదుపరి ప్రాధాన్య ఓట్లలో తెదేపా వైపు విజయం మొగ్గు చూపే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండుచోట్ల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఎవరికెన్ని శాతం ఓట్లు దక్కాయో స్పష్టమైంది. మొదటి ప్రాధాన్య ఓట్ల ఆధారంగానే ఓట్ల శాతం లెక్కించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో వైకాపా కన్నా తెదేపా 14.39 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉండగా రాయలసీమ తూర్పు నియోజకవర్గంలో 10.78 శాతం ఆధిక్యం సాధించింది. వైకాపా నమోదు చేయించుకున్న బోగస్‌ ఓట్ల ప్రభావమే లేకపోతే ఈ వ్యత్యాసం మరింత పెరిగేదని ఒక తెదేపా నాయకుడు వ్యాఖ్యానించారు. మారుతున్న ప్రజాభిప్రాయానికి, జగన్‌ ప్రభుత్వంపై అసంతృప్తికి ఇది నిలువుటద్దమని పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు బొటాబొటీగా గెలిచారు. అది కూడా వారికి రాజకీయంగా ప్రతికూల పరిస్థితులున్నాయనడానికి నిదర్శనమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నో ప్రలోభాలు, బోగస్‌ ఓట్లు, అధికార పార్టీ అక్రమాలు, విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మద్దతు, అధికార యంత్రాంగం ఎన్నికల నిబంధనలను కూడా తోసిరాజని వైకాపా అభ్యర్థులకు సహకరించడం వంటి అనేక అంశాల వల్లే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా చచ్చీచెడీ గెలిచిందని పీడీఎఫ్‌ నాయకులు పేర్కొంటున్నారు.

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకూ ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. మరో ఏడాదిలో శాసనసభకు సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ముందు మరే ఇతర ఎన్నికల్లేని నేపథ్యంలో ఈ ఎన్నికల నామినేషన్ల నుంచి లెక్కింపు వరకూ ప్రతి ఘట్టమూ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీల కార్యాచరణలకు, ఆత్మ విశ్వాసానికి, ప్రజల్లో మార్పు ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఇదో పరీక్ష. ఈ ఎన్నికల్లో అధికార వైకాపాకు తీవ్ర వ్యతిరేకత కనిపించడం గమనార్హం.

108 నియోజకవర్గాల విస్తృత ప్రజాభిప్రాయం

రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే అందులో 9 ఉమ్మడి జిల్లాల్లో ఈ పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. ఇందులో కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాలు, అంతకన్నా ఎంతో ముఖ్యమైన రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిసి ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ఏకంగా 108 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రులు ఓటేశారు. శ్రీకాకుళం, విజయనగరం విశాఖ (ఉత్తరాంధ్ర) పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 2,89,214 మంది ఓటర్లుండగా 2,13,035 మంది ఓటేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు (తూర్పు రాయలసీమ) పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3,81,181 మంది ఓటర్లకు గాను 2,69,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప, అనంతపురం, కర్నూలు (పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల నియోజకవర్గంలో 3,30,124 మంది ఓటర్లుండగా 2,45,576 ఓటేశారు. అంటే ఏకంగా 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల్లో 7,16,250 మంది ఓటర్ల అభిప్రాయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఫలితాలకు విస్తృత ప్రాధాన్యం ఉంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో తెదేపా.. వైకాపా కన్నా ఏకంగా పది శాతానికి పైగా అధికంగా ఓట్లు తెచ్చుకుని గెలుపొందింది. 2019 సాధారణ ఎన్నికల్లో తెదేపా కన్నా వైకాపాకు దాదాపు 10 శాతం అధికంగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుత పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా అంతకు మించి ఓట్లు సంపాదించుకోవడం విశేషం.

నమ్ముకున్న జిల్లాల్లోనే చతికిలపడిన వైకాపా

ఈ ఎన్నికలు జరిగినవి అధికార వైకాపాకు ఎంతో కీలకమైన, వారికి పట్టున్న రాయలసీమ జిల్లాలు, తమకు బలమైన ప్రాంతాలుగా వారు పేర్కొనే దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. తమకు ఈ ఆరు జిల్లాల్లోనే అధిక సీట్లు వస్తాయని వైకాపా భావిస్తుంటుంది. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలపై వైకాపా ఎంతో ఆశపెట్టుకుంది. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించింది. మూడు రాజధానుల్లో రాయలసీమలోని కర్నూలుకు న్యాయ రాజధాని తరలిస్తామని చెబుతున్నారు. ఇలా తమకు పట్టుందని, అత్యధిక సీట్లను గెలుస్తామని భావిస్తున్న వైకాపాకు అక్కడే ప్రత్యర్థి కంటే తక్కువ ఓట్లు రావడం మింగుడుపడని అంశమే.

ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన కారణం

ఏడు లక్షల మందికి పైగా పట్టభద్ర ఓటర్లు, పూర్తిగా విద్యావంతులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఫలితాల్లో వైకాపా ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో వెల్లడయింది. ఈ ఓటర్లలో దిగువ, ఎగువ మధ్య తరగతివారే అధికం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఈ ఓటర్లలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని ఈ వర్గాల్లో ఇప్పటికే బలమైన అభిప్రాయం ఏర్పడింది. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, ప్రతి నెలా మూడో వారం వరకు కూడా ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పింఛన్లు అందకపోవడం వంటి అంశాల ప్రభావం ఈ ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఇలాంటి అంశాలెన్నో వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచాయని, అవే ఈ ఫలితాలకు కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది.

వైకాపాకు హేమాహేమీలున్నా...

ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తమకు తిరుగులేదని అనుకుంది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తమకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుందని భావించింది. మరోవైపు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రాయలసీమలో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి హేమాహేమీలైన నేతలున్నారు.  వైవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఉత్తరాంధ్రలో పాలనా రాజధాని నినాదం, కర్నూలులో న్యాయ రాజధాని పెడతామన్న మాటలు తమకు కలిసొస్తాయని వైకాపా భావించింది. కానీ మూడింట్లో ఒకటి తెదేపా గెలిచింది. మరోచోట వైకాపా ఓటమికి చేరువగా ఉండటం గమనార్హం.

అధికార యంత్రాంగం అడ్డగోలుగా సహకరించినా..

ఈ ఎన్నికల్లో అధికారులు అన్ని స్థాయుల్లో అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అనేకచోట్ల బోగస్‌ ఓట్లు చేర్పించారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా వాటిని పూర్తి స్థాయిలో తొలగించలేదు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసినా పోలీసు యంత్రాంగం పట్టించుకోలేదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. పైగా వైకాపా చదువు లేనివారిని కూడా పట్టభద్ర ఓటర్లుగా చేర్చిందని ఆధారాలతో బయటపడింది. అధికార పార్టీ ఇన్ని అడ్డదారులు తొక్కినా ఓటమి నుంచి బయటపడలేకపోయిందని ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని