ఇల్లెందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: గుమ్మడి నర్సయ్య కుమార్తె ప్రొఫెసర్‌ అనురాధ

వచ్చే ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె, ఉస్మానియా పీజీ న్యాయ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. గుమ్మడి అనురాధ ప్రకటించారు.

Updated : 31 Aug 2023 07:10 IST

గుమ్మడి నర్సయ్య కుమార్తె అనూరాధ

ఇల్లెందు, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె, ఉస్మానియా పీజీ న్యాయ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. గుమ్మడి అనురాధ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నేను భారాస అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు ఈ అంశంపై నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. నాకు నేనుగా మాత్రం ఏ పార్టీని కలవలేదు. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులను స్వయంగా గమనించేందుకు నియోజకవర్గంలో పర్యటించా. ఈ క్రమంలో స్వచ్ఛమైన, స్వేచ్ఛా రాజకీయాలే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీల ప్రతినిధులు స్వాగతించారు. నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల బారినుంచి కాపాడే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా’’ అని అనురాధ వెల్లడించారు. ‘మీ తండ్రి పోటీచేస్తే మీరూ బరిలో నిలుస్తారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ తమ మధ్య పోటీ ఉండదన్నారు. తన నిర్ణయాన్ని తన తండ్రి స్వాగతించారన్నారు. భారాస, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ టికెట్ తనకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. తాను మాత్రం స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని