రాజ్యసభ ఎన్నికలకు నగారా

సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభలో ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే ఏప్రిల్‌ 2, 3 తేదీలతో ముగుస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి సోమవారం షెడ్యూలు విడుదల చేసింది.

Published : 30 Jan 2024 05:19 IST

ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లకు పోలింగ్‌
15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూలు విడుదల
ఫిబ్రవరి 27న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు
ముగియనున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవీ కాలం
జాబితాలో జేపీ నడ్డా, మన్మోహన్‌ సింగ్‌ కూడా..

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభలో ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే ఏప్రిల్‌ 2, 3 తేదీలతో ముగుస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 27న పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఎన్నికల షెడ్యూలు

  • నోటిఫికేషన్‌ జారీ- ఫిబ్రవరి 8 (గురువారం)
  • నామినేషన్లకు చివరి తేదీ- ఫిబ్రవరి 15 (గురువారం)
  • నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 16 (శుక్రవారం)
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ- ఫిబ్రవరి 20 (మంగళవారం)
  • పోలింగ్‌ తేదీ- ఫిబ్రవరి 27 (మంగళవారం)
  • పోలింగ్‌ సమయం- ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  • ఓట్ల లెక్కింపు- ఫిబ్రవరి 27 సాయంత్రం 5 గంటల తర్వాత
  • ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన తేదీ- ఫిబ్రవరి 29

పదవీ కాలం ముగిసేది వీరికే..

వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవీ కాలం ముగియనుంది. ఇందులో గుజరాత్‌ నుంచి మన్‌సుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, కర్ణాటక నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌, ఎల్‌.మురుగన్‌, మహారాష్ట్ర నుంచి నారాయణ్‌ రాణే, ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌, రాజస్థాన్‌ నుంచి భూపేందర్‌ యాదవ్‌ ఉన్నారు. ఇతర ప్రముఖుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌ల పదవీ కాలం ముగియనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావు స్థానమూ ఖాళీ కానుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని 3 స్థానాల్లో రెండు కాంగ్రెస్‌, ఒకటి భారాస దక్కించుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలూ వైకాపాకు దక్కే అవకాశముంది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి భాజపాకు ఈసారి సీటు దక్కే అవకాశం లేనందున భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే రాష్ట్రానికి బదిలీ కావాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని