భువనగిరి లోక్‌సభ బరిలో సీపీఎం!

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక స్థానంలో పోటీ చేయాలని సీపీఎం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భువనగిరిలో బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది.

Updated : 20 Mar 2024 06:30 IST

మల్లు లక్ష్మి, నంద్యాల, జూలకంటి, చెరుపల్లిల్లో ఒకరికి అవకాశం
నేడు ఖరారు చేయనున్న పొలిట్‌బ్యూరో

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక స్థానంలో పోటీ చేయాలని సీపీఎం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భువనగిరిలో బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు మిగిలిన 16 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ పొలిట్‌బ్యూరోకు అప్పగించింది. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, లోక్‌సభ ఎన్నికలపై సమావేశంలో నేతలు చర్చించారు. పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం, ఆ స్థానానికి పరిశీలిస్తున్న నాయకుల పేర్లను పొలిట్‌బ్యూరోకు మంగళవారం సాయంత్రం పంపించారు. భువనగిరి స్థానానికి మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు పేర్లు సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. వీరిలో ఒకర్ని పొలిట్‌బ్యూరో ఖరారు చేయనుంది.

బుధవారం ఉదయం 11 గంటలకు దిల్లీలో జరిగే పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం భువనగిరి అభ్యర్థిని రాష్ట్ర పార్టీ ప్రకటించనుంది. ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి మద్దతిచ్చే విషయంపైనా స్పష్టత ఇవ్వనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐల పొత్తు దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి. భువనగిరి మినహా మిగిలిన అన్నిచోట్ల కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతిస్తుందా? భాజపా బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడించే అవకాశమున్న లౌకిక పార్టీకి మద్దతిస్తుందా? అన్న అంశాన్ని బుధవారం నిర్ణయించనుంది. మంగళవారం జ్యోతి అధ్యక్షతన జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో నేతలు ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, పోతినేని సుదర్శన్‌, జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సింహారావు, చెరుపల్లి సీతారాములు, జాన్‌వెస్లీ, అబ్బాస్‌ పాల్గొన్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో సమావేశానికి హాజరు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని