కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

తెలుగుదేశం పార్టీ శుక్రవారం మరో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది మూడో జాబితా. దీంతో ఇప్పటివరకు తెదేపా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య 138కి చేరింది.

Updated : 23 Mar 2024 06:52 IST

11 అసెంబ్లీ స్థానాలకు తెదేపా అభ్యర్థుల ప్రకటన
కొందరు సీనియర్లకు దక్కిన అవకాశం
మరికొందరి విషయంలో వీడని ఉత్కంఠ

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ శుక్రవారం మరో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది మూడో జాబితా. దీంతో ఇప్పటివరకు తెదేపా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య 138కి చేరింది. పొత్తులో భాగంగా జనసేనకు 21, భాజపాకు 10 సీట్లు కేటాయించగా... తెదేపా 144 స్థానాల్లో  పోటీచేస్తోంది. వాటిలో 6 సీట్లకు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. మాజీ మంత్రులు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, దేవినేని ఉమామహేశ్వరరావుల  పేర్లు మూడో జాబితాలోనూ లేవు. కళా, గంటా సీట్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండగా... దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజాలకు ఈ ఎన్నికట్లో టికెట్లు లేవని స్పష్టమైంది. వారిద్దరూ ఆశలు పెట్టుకున్న పెనమలూరు టికెట్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్‌ఛార్జి బోడే ప్రసాద్‌కే పార్టీ ఖరారు చేసింది. గతంలో ఉమా ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం ఆయన ఇన్‌ఛార్జిగా ఉన్న మైలవరం టికెట్‌ని వసంత కృష్ణప్రసాద్‌కి పార్టీ కేటాయించింది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉమాపై గెలిచిన ఆయన ఇటీవలే తెదేపాలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి టికెట్‌ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికే కేటాయించడంతో ఆయన అభ్యర్థిత్వంపై కొన్నాళ్లుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం ప్రకటించిన 11 మందిలో ఏడుగురు బీసీలు, ఒకరు ఎస్సీ, ముగ్గురు ఇతరులు ఉన్నారు. తెదేపా ఇప్పటివరకు ప్రకటించిన 138 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 31, ఎస్సీలకు 26, క్షత్రియులకు 5, ముస్లింలకు 3, వైశ్యులకు 2, వెలమలకు 1 స్థానం కేటాయించింది.

కొనసాగుతున్న ఉత్కంఠ

టికెట్‌ వస్తుందా.. రాదా? అన్న సందిగ్ధంలో ఉన్న కొందరు నాయకులకు తాజా జాబితా సంతోషం కలిగించగా, మరికొందరికి ఖేదం మిగిల్చింది. మరికొందరికి ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్‌ ఆశిస్తుండగా... ఆయనను విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆయన టికెట్‌పై ఉత్కంఠకు తెరపడలేదు. మరో సీనియర్‌ నేత కళా వెంకటరావు ఎచ్చెర్ల టికెట్‌ ఆశిస్తుండగా... ఆయనను చీపురుపల్లికి గానీ, విజయనగరం ఎంపీగా గానీ పంపుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజా జాబితాలోనూ దానిపై స్పష్టత ఇవ్వలేదు.

  • పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కి ఈసారి టికెట్‌ ఇవ్వలేమని పార్టీ అధినాయకత్వం మొదట చెప్పేసింది. పెనమలూరు నుంచి దేవినేని ఉమా, ఆలపాటి రాజాల పేర్లు పరిశీలిస్తున్నట్టు ప్రచారమూ జరిగింది. చివరకు స్థానిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని బోడే ప్రసాద్‌కే టికెట్‌ ఖరారు చేసింది.
  • పొత్తులో భాగంగా మొదట అమలాపురం టికెట్‌ జనసేనకు కేటాయించాలనుకున్నారు. పి.గన్నవరం స్థానానికి మహాసేన రాజేశ్‌ను తెదేపా అభ్యర్థిగా ప్రకటించింది. అమలాపురం టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నిరాశ చెందారు. తర్వాత పరిణామాల్లో... వైకాపా తనపై దుష్ప్రచారం చేయడంతో ఆవేదన చెందిన రాజేశ్‌ పోటీనుంచి వైదొలిగారు. దాంతో ఆ సీటు ఆనందరావుకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా తెదేపా పి.గన్నవరం సీటును మిత్రపక్షాల కోసం వదులుకోవడంతో... మళ్లీ అమలాపురం నుంచి పోటీచేసే అవకాశం ఆనందరావుకు దక్కింది.

పాతవారికే పట్టం

ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా ఉన్న గౌతు శిరీష (పలాస), కోళ్ల లలితకుమారి (ఎస్‌.కోట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ), చదలవాడ అరవింద్‌బాబు (నరసరావుపేట)లకు ఊరట లభించింది. ఆయా నియోజకవర్గాల్లో వేరే  అభ్యర్థుల్ని రంగంలోకి దించుతారని ప్రచారం జరగడం, తొలి రెండు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో వీరు కొంత టెన్షన్‌గా ఉన్నారు. కొత్తవారిని బరిలోకి దించాలని పార్టీ అధినాయకత్వం మొదట భావించింది. కాకినాడలో సిటీ టికెట్‌ వనమాడి కొండబాబుకు బదులు ఆయన సతీమణికి ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. సర్వేపల్లి టికెట్‌ సోమిరెడ్డి కోడలికి ఇస్తారన్న ప్రచారమూ సాగింది. చివరకు పాతవారిపైనే నమ్మకం ఉంచిన అధిష్ఠానం వారికే అవకాశమిచ్చింది.

ఎచ్చెర్ల సీటు భాజపాకు?

పొత్తులో భాగంగా శ్రీకాకుళం సీటు భాజపాకు కేటాయించాలని మొదట నిర్ణయించారు. తాజాగా అక్కడి పరిణామాల్ని బేరీజు వేసుకున్నాక శ్రీకాకుళం సీటు తెదేపా తీసుకుని, దానికి బదులుగా అదే జిల్లాలోని ఎచ్చెర్ల సీటు భాజపాకు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. దానిలో భాగంగానే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి గొండు శంకర్‌ అభ్యర్థిత్వాన్ని తెదేపా ఖరారు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని