తుక్కుగూడ నుంచే కాంగ్రెస్‌ శంఖారావం!

పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో ప్రారంభించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్‌ మొదటివారంలో హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టింది.

Updated : 24 Mar 2024 06:21 IST

ఏప్రిల్‌ మొదటివారంలో భారీ బహిరంగ సభ
హాజరుకానున్న మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ
జాతీయస్థాయి మ్యానిఫెస్టో తెలుగు ప్రతి విడుదల అక్కడే

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో ప్రారంభించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్‌ మొదటివారంలో హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభకు హాజరుకానున్నారని తెలుస్తోంది. పార్టీ జాతీయస్థాయి ఎన్నికల మ్యానిఫెస్టో తెలుగు ప్రతిని ఈ సభలో అగ్రనేతలు విడుదల చేయనున్నారు.

గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడలో ‘విజయభేరి’ బహిరంగ సభతోనే రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సభలో అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ, ఖర్గే ప్రకటించిన గ్యారంటీ హామీలతో ఎన్నికల ప్రచారంలో ఊపువచ్చి విజయం సాధించినట్లు పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. ఆ సెంటిమెంట్‌తో రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలనూ అక్కడి నుంచే ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది. మొత్తం 17కి గాను 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు ఈ నెలాఖరుకల్లా ఖరారు చేయనుంది.

ప్రచార వ్యూహంపై కసరత్తు

పార్టీ ప్రచార వ్యూహంపైనా సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. శనివారం తన నివాసంలో ఈ అంశంపై మంత్రులు, ఇతర నేతలతో చర్చించారు. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచి తీరాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అక్కడి అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారంపైనా చర్చించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారానికి విడివిడిగా ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ముఖ్య నేతలను పర్యవేక్షకులుగా నియమించేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది. పార్టీ గెలిచిన 64 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలు, మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిన నేతల పర్యవేక్షణలోనే ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. టికెట్లు వచ్చిన అభ్యర్థులు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ అభ్యర్ధి మల్లు రవి శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణతో సమావేశమై ప్రచార కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించారు.

కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి కావడంతో.. అధిష్ఠానం సైతం ఇక్కడ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వస్థలం పాత హైదరాబాద్‌ సంస్థానం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లను గెలుచుకోవాలని ఖర్గే పట్టుదలతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని