సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థి పద్మారావు

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ భారాస అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్‌, నల్గొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌లను పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం ఖరారు చేశారు.

Updated : 24 Mar 2024 14:46 IST

నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి..
భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌
ఖరారు చేసిన కేసీఆర్‌
ఇక మిగిలింది హైదరాబాద్‌ ఒక్కటే..

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ భారాస అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్‌, నల్గొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌లను పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం ఖరారు చేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను.. వీటితో కలిపి 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇక హైదరాబాద్‌ ఒక్కటే మిగిలింది. ఇటీవల పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు. ఇప్పుడు పొత్తు లేకపోవడంతో ఆ స్థానం నుంచి భారాస పోటీ అనివార్యమైంది. మజ్లిస్‌కు హైదరాబాద్‌ బలమైన స్థానమైనందున, అన్ని కోణాల్లో చర్చించి ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసే వీలుంది. సికింద్రాబాద్‌, నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్‌ శనివారం సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. పార్టీ సీనియర్‌ నేత, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి విధేయుడిగా, తనకు సన్నిహితునిగా ఉన్న పద్మారావుపై నగర ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం వ్యక్తంచేయగా.. సికింద్రాబాద్‌ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సీనియర్‌ నేత కంచర్ల కృష్ణారెడ్డికి విజయావకాశాలున్నాయని ఆయనను ఎంపిక చేశారు. భువనగిరి స్థానం నుంచి పలువురు పోటీ పడినా... చివరికి బలమైన సామాజికవర్గ నేతగా క్యామ మల్లేశ్‌ను ఖరారు చేశారు. తమ పేర్ల ప్రకటన అనంతరం పద్మారావు, కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌లు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సికింద్రాబాద్‌లో విజయం ఖాయం

‘‘సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం భారాసకు కంచుకోట అని శాసనసభ ఎన్నికల్లో రుజువైంది. అంతకుమించిన మెజారిటీతో గెలిచి పద్మారావు లోక్‌సభలో అడుగుపెడతారు. ఆయన అజాతశత్రువు. అన్ని వర్గాలకు సన్నిహితుడు. సికింద్రాబాద్‌ అభివృద్ధిని.. ఇప్పటివరకు ఎన్నికైన ఎంపీలు పట్టించుకోలేదు. పద్మారావు ఆ లోటును భర్తీ చేస్తారు. ఆయన ద్వారా ప్రగతికి మారుపేరుగా లష్కర్‌ నిలుస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు కలిసిమెలిసి పనిచేసి బలాన్ని చాటాలి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

అభ్యర్థుల నేపథ్యం..

  • తెరాస వ్యవస్థాపక నేతల్లో పద్మారావు ఒకరు. సికింద్రాబాద్‌ నుంచి 2004, 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర మంత్రిగా, 2018 నుంచి 2023 వరకు ఉపసభాపతిగా పనిచేశారు. 
  • నల్గొండ జిల్లా ఉరుమడ్లకు చెందిన కృష్ణారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు. మునుగోడు టికెట్‌ కోసం గతంలో మూడు దఫాలు ప్రయత్నించారు. ఆయా సందర్భాల్లో కేసీఆర్‌ బుజ్జగించి తగిన అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయనకు ఇప్పుడు టికెట్‌ లభించింది.
  • భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీపట్నంకు చెందిన క్యామ మల్లేశ్‌.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా రెండు దఫాలు పనిచేశారు. 2018లో కాంగ్రెస్‌ను వీడి భారాసలో చేరారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

ప్రవీణ్‌, వెంకట్రామిరెడ్డిలకు కేటీఆర్‌ అభినందనలు

అఖిల భారత సర్వీసు మాజీ అధికారులు వెంకట్రామిరెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లకు భారాస లోక్‌సభ అభ్యర్థులుగా టికెట్లు ఇవ్వడం ద్వారా అధినేత కేసీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. మెదక్‌ అభ్యర్థిగా టికెట్‌ పొందిన మాజీ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థిగా అవకాశం పొందిన మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వారిద్దరూ భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టడం ఖాయమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని