272 సీట్లు ఇండియా కూటమివే

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 272 సీట్లు సాధించి భాజపాను గద్దె దించుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ధీమా వ్యక్తంచేశారు.

Updated : 25 Mar 2024 06:16 IST

జైరాం రమేశ్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 272 సీట్లు సాధించి భాజపాను గద్దె దించుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఒంటరిగానే పోటీ చేస్తున్నా, కూటమి నుంచి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వైదొలిగినా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం ఉండదని ఆదివారం పీటీఐ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో తమ పొత్తు చెక్కుచెదరలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం, సీపీఐలతో త్వరలోనే పొత్తు కొలిక్కి వస్తుందని, సీట్లు పంచుకోకపోయినా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పటికీ కూటమిలో భాగమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు విముఖంగా ఉన్నారన్న వాదనను తోసిపుచ్చారు. పార్టీ అడిగితే పోటీ చేయని అభ్యర్థులు ఎవరూ లేరని, ఎన్నికల కమిటీ అడిగితే పోటీచేస్తానని రాహుల్‌గాంధీ కూడా ఇదివరకే చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల బాండ్ల గురించి మాట్లాడుతూ- రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులతో రూ.4వేల కోట్ల బాండ్లు ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఎన్నికల బాండ్లకు, కాంట్రాక్టుల కేటాయింపులకు స్పష్టమైన సంబంధం ఉందన్నారు. రూపాయి విలువ పతనంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని ఎక్స్‌ వేదికగా రమేశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు