ముగ్గురు కేంద్రమంత్రులకు హుళక్కి

లోక్‌సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో భాజపా ఆదివారం అయిదో జాబితా విడుదల చేసింది.

Updated : 25 Mar 2024 06:10 IST

హిమాచల్‌ బరిలో కంగనా రనౌత్‌
రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెగ్డేపై వేటు
పార్టీలో చేరిన గంటల్లోనే నవీన్‌ జిందాల్‌కు టికెట్‌
111 మందితో భాజపా అయిదో జాబితా

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో భాజపా ఆదివారం అయిదో జాబితా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీచేసే ఆరు స్థానాలకు, తెలంగాణలో మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. కేంద్ర మంత్రులు నిత్యానందరాయ్‌, గిరిరాజ్‌సింగ్‌, ఆర్‌కే సింగ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లకు తాజా జాబితాలో చోటు దక్కింది. సహాయ మంత్రులు అశ్వినీకుమార్‌ చౌబే, బిశ్వేశ్వర్‌ టుడూ, వి.కె.సింగ్‌లకు స్థానం లభించలేదు. ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ స్థానం నుంచి బరిలోకి దింపింది. పశ్చిమబెంగాల్‌ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ను ఆ రాష్ట్రంలోని తమ్‌లుక్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ స్థానం నుంచి వరుణ్‌గాంధీని తప్పించి జితిన్‌ ప్రసాదకు అవకాశం కల్పించింది. మేనకాగాంధీని సుల్తాన్‌పుర్‌ నుంచి పోటీకి నిలిపింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 402 మంది అభ్యర్థులను భాజపా ప్రకటించినట్లయింది.


మేరఠ్‌లో అరుణ్‌ గోవిల్‌

రామాయణ్‌ టీవీ ధారావాహికలో రాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ స్థానం నుంచి భాజపా రంగంలోకి దింపింది. ఆదివారమే పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ను హరియాణాలోని కురుక్షేత్ర స్థానం నుంచి పోటీకి నిలిపింది. గుజరాత్‌లోని సాబర్‌కాంఠా, వదోదర స్థానాలకు ఇదివరకు ప్రకటించిన అభ్యర్థులు వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో ఆ స్థానాల నుంచి కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇటీవల జేఎంఎం నుంచి భాజపాలో చేరిన ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ను ఆ రాష్ట్రంలోని డుంకా స్థానం నుంచి రంగంలోకి దింపింది. గుజరాత్‌ నుంచి ప్రకటించిన 6 స్థానాల్లో ఒక్క జునాగఢ్‌ సిట్టింగ్‌ ఎంపీని మినహాయిస్తే మిగిలిన మెహ్‌సాణా, సురేంద్రనగర్‌, అమ్రేలి, సాబర్‌కాంఠా, వడోదర ఎంపీలను మార్చారు. హరియాణా నుంచి ప్రకటించిన నాలుగు స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలను తప్పించారు.


ఆ వ్యాఖ్యలకు తగిన మూల్యం

హిమాచల్‌లో మండీ స్థానం నుంచి సినీనటి కంగనా రనౌత్‌ను పోటీకి నిలిపారు. కర్ణాటకలోని బెలగావి నుంచి దివంగత కేంద్రమంత్రి సురేష్‌ అంగడి కుటుంబ సభ్యులను తప్పించి ఇటీవల పార్టీలోకి తిరిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ను నిలబెట్టారు. ఈసారి భాజపా 400కుపైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అనంతకుమార్‌ హెగ్డే మూల్యం చెల్లించుకున్నారు. ఉత్తర కన్నడ స్థానంలో ఆయన్ని తప్పించి విశ్వేశ్వర్‌ హెగ్డేను రంగంలోకి దింపారు. ఆ రాష్ట్రం నుంచి ప్రకటించిన 4 స్థానాల్లో మూడుచోట్ల కొత్తవారికే అవకాశమిచ్చారు.

రాహుల్‌పై పోటీకి సురేంద్రన్‌

కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ను రంగంలోకి దింపారు. మహారాష్ట్ర నుంచి ప్రకటించిన మూడు స్థానాల్లో ఒకచోట సిట్టింగ్‌ను మార్చారు. ఒడిశాలో ప్రకటించిన 18 స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్‌లను తప్పించారు. వీరిలో కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ ఒకరు. నలుగురు సిట్టింగ్‌లను కొనసాగించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి జుయల్‌ ఓరం ఉన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద ప్రధాన్‌ (సంబల్‌పుర్‌), పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పండా, అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర (పూరీ)లను ఈసారి లోక్‌సభ బరిలోకి దింపారు. రాజస్థాన్‌ నుంచి ఏడుగురిని ప్రకటించగా వారిలో సిట్టింగు అభ్యర్థులు ఇద్దరే. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ప్రకటించిన 13 స్థానాల్లో మేరఠ్‌, గాజియాబాద్‌, హాథ్రస్‌, బదాయూ, బరేలీ, పీలీభీత్‌, కాన్పుర్‌ తదితర చోట్ల సిట్టింగ్‌లను మార్చారు. పశ్చిమబెంగాల్‌ నుంచి ప్రకటించిన 19 స్థానాల్లో.. బర్దమాన్‌ దుర్గాపుర్‌ ఎంపీ ఎస్‌ఎస్‌ అహ్లువాలియాకు మినహాయించి మిగిలిన 17 మంది సిట్టింగ్‌ ఎంపీలకు స్థానం కల్పించారు.


ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?

తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆరుగురు, బిహార్‌ 17, ఒడిశా 18, ఉత్తర్‌ప్రదేశ్‌ 13, పశ్చిమబెంగాల్‌ నుంచి 19 మంది అభ్యర్థులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని