INDIA BLOC: వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..: ‘ఇండియా’ కూటమి నేతల ధీమా

భాజపా అవినీతికి పాల్పడిందని ‘ఎలక్టోరల్ బాండ్లు’ నిరూపించాయని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు.

Published : 17 Mar 2024 21:54 IST

ముంబయి: ‘ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఐటీ’ల సాయం లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) గెలవలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అవినీతిపై ప్రధాని మోదీకే గుత్తాధిపత్యం ఉందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలను ఎత్తిచూపేందుకే ‘భారత్ జోడో యాత్ర’లను నిర్వహించినట్లు తెలిపారు. ‘‘శివసేన, ఎన్సీపీలు ఊరికే చీలిపోయి అధికార కూటమిలో చేరాయని భావిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. ముంబయిలోని శివాజీ పార్కులో నిర్వహించిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ ముగింపు సభకు ‘ఇండియా కూటమి’ నేతలు హాజరై భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే (INDIA Bloc)నని, తాము లౌకిక, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లతో భాజపా (BJP) అవినీతి బయటపడిందన్నారు. కమలదళం నాశనం చేసిన భారతదేశపు ఆత్మను పరికించే ప్రయత్నమే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

19న సీడబ్ల్యూసీ కీలక భేటీ.. 20న కాంగ్రెస్‌ అభ్యర్థుల తదుపరి జాబితా!

‘‘విదేశీ పర్యటనలు, దుష్ప్రచారం.. పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పనులివే. ప్రతిపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టినప్పటి నుంచి.. భయంతో భాజపా ఈ పదాన్నే ఉపయోగించడం మానేసింది. ప్రధాని మోదీ విపక్ష నేతలను అవినీతిపరులుగా ముద్ర వేయడం ప్రారంభించారు. కానీ, ఎలక్టోరల్ బాండ్లు మాత్రం.. భాజపానే అవినీతికి పాల్పడిందని నిరూపించాయి. ఇది ఆ పార్టీ వైట్ కాలర్ అవినీతి’’ అని స్టాలిన్ ఆరోపించారు. దేశానికి ఆ పార్టీ కంటే పెద్ద ముప్పు మరొకటి లేదని దుయ్యబట్టారు. కమలం పార్టీని ఓడించాలని, కన్యాకుమారిలో ప్రారంభమైన ప్రయాణం.. దిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ముగియాలని చెప్పారు.

మార్పు అవసరం: శరద్‌ పవార్‌

  • దేశ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భాజపా తప్పుడు హామీలు ఇచ్చి దేశ ప్రజలను వంచించింది. కలిసికట్టుగా ఆ పార్టీని గద్దె దించాలి. ‘క్విట్‌ ఇండియా’ మాదిరి ముంబయి నుంచే ఆ పిలుపు ఇస్తున్నాం. - ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) అధ్యక్షుడు శరద్‌ పవార్‌
  • ఈడీ, సీబీఐల సాయంలో కేంద్రం ప్రభుత్వాలను పడగొడుతోంది. మా పోరాటం విద్వేష భావజాలంపైనే. వ్యక్తిగతంగా ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాదు - ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
  • ప్రజలు ఏకమైతే.. నియంతృత్వం అంతం అవుతుంది - శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే
  • దేశాన్ని రక్షించేందుకే ‘ఇండియా’ కూటమి పక్షాలు ఏకమయ్యాయి - నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా
  • రాజ్యాంగాన్ని మార్చేందుకే 400కుపైగా సీట్ల గురించి భాజపా మాట్లాడుతోంది. రాహుల్ గాంధీ పేరులో ‘గాంధీ’ అంటే ఆ పార్టీకి భయం - మహబూబా ముఫ్తీ
  • మేం జైలుకు వెళ్లేందుకు కూడా భయపడటం లేదు. అందుకే ఐక్యంగా ఉన్నాం. గెలవాలంటే పోరాడాల్సిందే - ఆప్ నేత, దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
  • కుట్రలో భాగంగానే నా భర్తను జైల్లో పెట్టారు - ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన

రాహుల్‌ అరుదైన వ్యక్తి.. అఖిలేశ్‌ యాదవ్‌

వచ్చే ఎన్నికల్లో భాజపాను ప్రజలు ఓడిస్తారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ‘‘భారత్‌ జోడో వంటి యాత్రలు చేయగల వ్యక్తులు చాలా అరుదు. ఈ విషయంలో బలమైన సంకల్పాన్ని చాటిన మీకు అభినందనలు’’ అని రాహుల్‌ గాంధీని ఉద్దేశించి రాసిన లేఖ విడుదల చేశారు. మణిపుర్‌లో ప్రారంభమైన న్యాయ్‌ యాత్ర నేడు ముంబయిలో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అఖిలేశ్‌ కూడా హాజరు కావాల్సింది. అయితే.. ఎన్నికల సన్నద్ధత నేపథ్యంలో రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో భాజపా ఓడించడమే ‘జోడో యాత్ర’కు నిజమైన విజయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని