Brian Lara: విండీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు ప్రాధాన్యమివ్వడాన్ని తప్పపట్టలేము: బ్రయాన్‌ లారా

వెస్టిండీస్‌ క్రికెట్‌ పతనానికి ఆటగాళ్లను తప్పు పట్టలేమని దిగ్గజ ఆటగాడు బ్రయాన్‌ లారా అన్నాడు. చిన్న వయసులోనే ఆటగాళ్లకు జాతీయ జట్టు పట్ల నిబద్ధతను నేర్పించాల్సిన బాధ్యత బోర్డుపైనే ఉందని అభిప్రాయపడ్డాడు.  

Published : 16 Jan 2024 18:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌ క్రికెటర్లు జాతీయ జట్టులో ఆడటం కంటే ఐపీఎల్‌ వంటి టీ20 లీగ్‌లకు ప్రాధాన్యమివ్వడాన్ని తప్పుపట్టలేమని విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా (Brian Lara) అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తమ జీవితావసరాలు తీర్చుకోవడానికే ఈ రోజుల్లో ఆడుతున్నారన్నారు. ‘‘19 ఏళ్ల ఆటగాడు తాను ఐపీఎల్‌కు వెళుతున్నానని చెప్పడం.. వెస్టిండీస్‌ క్రికెట్‌ను పట్టించుకోనని పేర్కొనడం అతడి తప్పు కాదు. 50 ఏళ్ల క్రితం దేశానికి ఆడి స్ఫూర్తి పొందేవారు. కానీ, నేడు ఆటనే జీవనాధారంగా చేసుకొన్నారు. దీనిని అర్థం చేసుకోవాలి. మేము వాస్తవాలను అంగీకరించాలి. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో మా క్రికెటర్లకు లభించేంత ఆకర్షణీయమైన డీల్స్‌తో పోటీపడుతూ వారికి జాతీయస్థాయిలో అవకాశాలిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుత తరం ఆలోచనా తీరును మార్చడం అసాధ్యం. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల అన్వేషణకు ముందే.. పాఠశాల స్థాయి క్రికెట్‌లో ప్రతిభావంతులను గుర్తించాలి. ఆ తర్వాత వారు జాతీయ జట్టులో ఆడాల్సిన అవసరాన్ని  బలంగా తెలియజెప్పాలి’’ అని లారా పేర్కొన్నాడు. 

యువీ, కోహ్లీ తర్వాత ఆ ఘనత సాధించింది దూబెనే..

జాతీయ జట్టు విషయంలో నిబద్ధతతో వ్యహరించాలని క్రికెటర్లు తెలుసుకోవాలని లారా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ జట్టుపై చాలా శ్రద్ధగా ఉంటారన్నాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎక్కువ జీతాలిచ్చినా.. ఇవ్వకపోయినా వారు జాతీయ జట్టుపై నిబద్ధతతో వ్యవహరిస్తారు. కానీ, అదే తాము (వెస్టిండీస్‌) చేయలేకపోతున్నామని లారా పేర్కొన్నాడు. విండీస్‌ ఆటగాళ్లు జాతీయ టెస్ట్‌ జట్టులో ఆడటం కంటే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగుల్లో ఆకర్షణీయమైన ఒప్పందాలకే మొగ్గు చూపుతున్నారు. దీని ఫలితమే దేశ టెస్ట్‌ క్రికెట్‌ పతనమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని