IPL: ఐపీఎల్‌పై సౌదీ ప్రిన్స్‌ కన్ను.. భారీ పెట్టుబడికి సిద్ధం?

Saudi prince on IPL: ఐపీఎల్‌పై సౌదీ అరేబియా కన్ను పడింది. ఇందులో వాటాలు కొనుగోలు చేయాలని ఆ దేశ యువరాజు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 03 Nov 2023 18:39 IST

Saudi Prince Eyes on IPL | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. పరిచయం అక్కర్లేని టోర్నమెంట్‌. 2008లో మొదలైన ఈ టోర్నీ అనతికాలంలో ఇంతితై అన్నట్లుగా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుందో వేరే చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే టీవీలకు, మొబైల్‌ స్క్రీన్లకు అతుక్కుపోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ వినోదం పక్కనపెడితే.. దీని చుట్టూ వేల కోట్ల వ్యాపారం జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. అలాంటి ఐపీఎల్‌పై సౌదీ కన్ను పడింది. ఐపీఎల్‌లో వాటా కొనుగోలు చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ ఐపీఎల్‌ను 30 బిలియన్‌ డాలర్లు విలువైన ఓ హోల్డింగ్‌ కంపెనీగా మార్చాలని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌బిన్‌ సల్మాన్‌ సలహాదారులు భారత ప్రభుత్వ ప్రతినిధులతో అన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. సెప్టెంబర్‌లో ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. ఈ హోల్డింగ్‌ కంపెనీలో యువరాజు 5 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఐపీఎల్‌ను ఇతర దేశాలకూ విస్తరించేందుకూ వీలు పడుతుందని ప్రతిపాదించినట్లు సమాచారం.

పసిపిల్లలు చనిపోతున్నారు.. మౌనమెందుకు?: ఇర్ఫాన్‌ పఠాన్‌

సౌదీ ప్రతిపాదనపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై బీసీసీఐ కూడా ఇంతవరకు స్పందించలేదు. ఐపీఎల్‌కు పోటీగా అనేక లీగ్‌లు సిద్ధమైనప్పటికీ ఆ స్థాయి ఆదరణను మాత్రం సాధించలేకపోయాయి. మరోవైపు ఐపీఎల్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా హక్కులను దక్కించుకునేందుకు టీవీ ఛానెళ్లు, ఓటీటీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సౌదీకి చెందిన ఆరామ్‌కో, సౌదీ టూరిజం డిపార్ట్‌మెంట్‌ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని