IND vs ENG : టీమ్‌ ఇండియాకు అతడే ఛాంపియన్‌ ప్లేయర్‌.. బుమ్రాపై రోహిత్‌ ప్రశంసలు

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయంలో స్టార్‌ పేసర్‌ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. అతడి ఆటతీరుపై సారథి రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు.

Updated : 05 Feb 2024 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  విశాఖ టెస్టు (IND vs ENG)లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ ఆటతీరు కాసేపు కంగారుపెట్టినా.. ఆ జట్టును మన బౌలర్లు నిలువరించిన తీరు అద్భుతం. మొత్తం 9 వికెట్లతో ఆకట్టుకున్న బుమ్రా (Jasprit Bumrah) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అతడి ప్రతిభను కొనియాడాడు.

భారత్‌దే వైజాగ్‌ టెస్టు..

మేం మంచి ప్రదర్శన చేశాం.. : రోహిత్‌

‘బుమ్రా మాకు ఛాంపియన్‌ ప్లేయర్‌. ఇలాంటి మ్యాచ్‌ల్లో గెలిచినప్పుడు.. జట్టు మొత్తం ప్రదర్శననూ చూడాలి. మేం బ్యాటింగ్‌లో రాణించాం. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ గెలవడం అంత సులభం కాదు. మా బౌలర్లు మెరుగవ్వాలని కోరుకున్నాను. వారు ఉత్తమంగా రాణించారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. చాలామంది బ్యాటర్లకు మంచి స్టార్ట్‌ లభించినా.. పెద్ద స్కోర్లుగా వాటిని మలచలేకపోయారు. వారంతా కుర్రాళ్లు.. నేర్చుకుంటారని భావిస్తున్నా. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ముఖ్యం. ఇలాంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టును చూస్తే గర్వంగా ఉంది. వారు స్వేచ్ఛగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలి. గత రెండేళ్లుగా ఇంగ్లాండ్‌ మంచి క్రికెట్‌ ఆడుతోంది. ఇది అంత సులువైన సీరిస్‌ కాదని తెలుసు. మరో మూడు టెస్టులు ఉన్నాయి. వాటిపై దృష్టి సారిస్తాం’ అని రోహిత్‌ అన్నాడు.

ఆ ఇద్దరూ అద్భుతమైన బౌలర్లు : స్టోక్స్‌

‘‘మేం లక్ష్యాన్ని ఛేదిస్తామనే చివరివరకూ అనుకున్నాం. అయితే.. స్కోర్‌బోర్డు ఒత్తిడి మాపై ప్రభావం చూపించింది. అందరూ నాణ్యమైన ఆటగాళ్లే. మొత్తం మ్యాచ్‌లో అండర్సన్‌, బుమ్రా అద్భుతమైన బౌలర్లు’’ అని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ అన్నాడు.

అచ్చొచ్చిన స్టేడియం విశాఖ..

భారత్ జట్టుకు అచ్చొచ్చిన స్టేడియంగా విశాఖ తన పేరును మరోమారు నిలబెట్టుకుంది. ఇక్కడ ఒక్కసారి కూడా టీమ్‌ఇండియా ఓటమిపాలు కాలేదు. ఇప్పటివరకూ మూడు టెస్టులు జరగ్గా.. అన్నింట్లోనూ భారీ విజయాలను నమోదు చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో, 2016లో ఇదే ఇంగ్లాండ్‌పై 246 పరుగుల తేడాతో ఘన విజయాలు అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని