IPL 2024: ఆటగాళ్ల పాస్‌పోర్టులను తీసుకుంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రెండో ఫేజ్‌ వేదిక మార్పు తప్పదా?

భారత్‌లోనే అన్ని ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ రెండో దశ వేదిక మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated : 16 Mar 2024 18:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 17వ సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 15 రోజుల షెడ్యూల్‌ను ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. అయితే, ఇవాళ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో.. ఐపీఎల్‌ రెండో దశ వేదిక మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల పాస్‌పోర్టులను ఫ్రాంచైజీలు తీసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పాస్‌పోర్టు కాలపరిమితికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. 

దుబాయ్‌ వేదికగా మిగతా మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ, ఐపీఎల్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ మాత్రం భారత్ వేదికగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని గతంలోనే వెల్లడించారు. మరి ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

‘‘ఎన్నికల తేదీలను బట్టి ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహించాలా? వేరే ప్రాంతానికి తరలించాలా? అనేది తేలుతుంది. దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరిస్తున్నాయి’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని