ODI WC 2023: నజం సేథి వ్యాఖ్యలు.. ప్రపంచ కప్‌లో పాక్‌ ఆడటంపై మళ్లీ అనుమానాలు?

ఆగస్ట్ 31 నుంచి ఆసియా కప్‌ను (Asia Cup 2023) నిర్వహించేందుకు ఏసీసీ సిద్ధమైపోయింది. పాకిస్థాన్‌ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌లోనే ఈసారి మినీ టోర్నీ జరగనుంది. దీంతో ప్రపంచకప్‌లో (ODI WC 2023) పాక్‌ ఆడుతుందిలే అని అంతా భావించారు. కానీ, పీసీబీ ఛైర్మన్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్ అభిమానులను కలవరానికి గురి చేశాయి.

Published : 17 Jun 2023 12:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం ఆసియా కప్ (Asia Cup 2023) నిర్వహణ తేదీలను ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక మినీ టోర్నీతోపాటు వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాదుల పోరును వీక్షించవచ్చని క్రికెట్ ఫ్యాన్స్‌ భావించారు. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ (PCB) నజం సేథీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ గందరగోళ పరిస్థితికి దారితీస్తుందా అన్నట్లుగా తయారయ్యాయి. తమ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్‌లో పర్యటించేందుకు అవకాశం ఉంటుందని, లేకపోతే మా చేతుల్లో ఏమీ ఉండదని నజం వ్యాఖ్యానించారు.

‘‘భారత్‌, పాకిస్థాన్‌ (IND vs PAK) విషయానికొస్తే.. ఎలాంటి నిర్ణయమైనా బీసీసీఐ, పీసీబీ సొంతంగా తీసుకోలేవు. ఇరు దేశాల ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయం తీసుకుంటాయి. భారత్‌ ఇక్కడికి రావాలన్నా.. మేం అక్కడికి వెళ్లాలన్నా మా ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందుకే, అహ్మదాబాద్‌లో మీరు ఆడతారా..? అనే ప్రశ్నను మమ్మల్ని అడిగేందుకు ఆస్కారం లేదు. గతంలో మేం ఐసీసీకి ఇదే చెప్పాం. భద్రతను పరిశీలించి మా ప్రభుత్వం అనుమతి ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేకుండా భారత్‌కు వెళ్లి ఆడతాం. ఒకవేళ వారు అనుమతి ఇవ్వకపోతే ఇండియాలో ఎలా ఆడగలం?. తొలుత ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వడంపైనే మేం అక్కడకు వెళ్లాలా.. వద్దా అనేది నిర్ణయం ఉంటుంది. ఆ తర్వాతే వేదికలపై ఓ నిర్ణయానికొస్తాం’’ అని సేథి తెలిపారు. 

మరోవైపు హైబ్రిడ్‌ మోడల్‌లో ఆసియా కప్‌ను నిర్వహించడానికి బీసీసీఐ సహా ఇతర దేశాల బోర్డులు ఆమోద ముద్ర వేశాయి. దీంతో ఆసియా కప్‌ను ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు నిర్వహించేందుకు ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ACC) నిర్ణయం తీసుకుంది. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంక వేదికగా 9 మ్యాచ్‌లు జరుగుతాయి. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లు లంకలోనే నిర్వహిస్తారు. ఈ క్రమంలో పాక్‌ కూడా భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో (ODI WC 2023) పాల్గొనడానికి అంగీకరించడంతో సమస్య తీరిపోయిందని అంతా భావించారు. కానీ, నజం సేథి తాజా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు ఐసీసీ సహా అందరినీ సందిగ్ధంలో పడేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని