Ravi Shastri: భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లకు మధ్య ఉన్న తేడా అదే..! రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 31 Oct 2023 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఈ వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England).. అంచనాలను తలకిందులు చేస్తూ ఘోర ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో అదీనూ బంగ్లాదేశ్‌పై గెలిచింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ జట్టుపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌ టీమ్‌ ప్రదర్శన ప్రేక్షకులు, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లకు మధ్య ఉన్న తేడాను వివరించాడు. 

‘‘ప్రేక్షకులు, అభిమానులను ఇంగ్లాండ్‌ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే వారు న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 17 ఓవర్లు మిగిలుండగానే ఓడిపోయారు. దక్షిణాఫ్రికాపై వారు కనీసం పోరాడకుండా 22 ఓవర్లకే ఆలౌటయ్యారు.  అనంతరం శ్రీలంకపై 33 ఓవర్లకు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని శ్రీలంక 25 ఓవర్లలో ఛేదించింది. తాజాగా భారత్‌పై 32 ఓవర్లలోపే ఎనిమిది వికెట్లు కోల్పోయారు. మీరా ప్రపంచ ఛాంపియన్స్‌.. ఈ ప్రదర్శనను చూసి వాళ్లే బాధపడకపోతే మరెవరు బాధపడతారు?’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లకు మధ్య ఉన్న తేడా ఏంటని అడిగితే.. నేను ఎనిమిది జట్లు అని చెబుతాను అని పాయింట్ల పట్టికలో రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేశాడు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆతిథ్య పాక్‌తోపాటు ప్రపంచకప్‌లో టాప్‌-7లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి.

‘‘ఇక నుంచి ఇంగ్లాండ్ పరువు కాపాడుకునేందుకు ఆడాలి. ఎందుకంటే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. 2025లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి ప్రపంచకప్‌లో టాప్‌-8 జట్లు అర్హత సాధిస్తాయి.ఒకవేళ ఇంగ్లాండ్ ఇలాగే కింది రెండు స్థానాల్లో ఉంటే.. అలాంటి టీమ్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది వారికి పెద్ద దెబ్బే అవుతుంది’’ అని రవిశాస్త్రి వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని