Rohit Sharma: టర్నింగ్‌ పిచ్‌లు.. వాటిపై చర్చించాల్సిన అవసరమే లేదు: రోహిత్ శర్మ

భారత్‌ గెలిచినప్పుడల్లా పిచ్‌ ప్రస్తావన రావడం సహజం. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లు తయారు చేయించుకుంటారనే కామెంట్లు వస్తుంటాయి. వాటిని కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించాడు.

Updated : 19 Feb 2024 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు (Team India) ఎలాంటి పిచ్‌లపైనైనా విజయం సాధిస్తుందని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఓడించిన (IND vs ENG) సంగతి తెలిసిందే. నాలుగో రోజు మూడో సెషన్‌లో బంతి విపరీతంగా తిరగడంతో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. రవీంద్ర జడేజా 5, కుల్‌దీప్‌ 2, అశ్విన్‌ ఒక వికెట్ తీశాడు. పేసర్‌ బుమ్రా కూడా కట్టుదిట్టంగా బంతులేసి వికెట్‌ పడగొట్టాడు. దీంతో భారత్‌ టర్నింగ్‌ పిచ్‌ల సాయంతో విజయాలు సాధిస్తుందనే కామెంట్లు వచ్చాయి. వాటిని రోహిత్ కొట్టిపడేశాడు.

‘‘ఇలాంటి పిచ్‌లపై గతంలోనూ మేం చాలా మ్యాచ్‌లు గెలిచాం. టర్నింగ్‌ ట్రాక్‌లపై సుడులు తిరిగే బంతిని ఎదుర్కోవడంతోపాటు మిగతా పిచ్‌లపైనా (పేస్‌) ఆడటం మా బలం. భవిష్యత్తుల్లోనూ అద్భుత ఫలితాలు సాధిస్తాం. ఇలాంటి పిచ్‌ తయారు చేయాలని ఎవరికీ చెప్పం. అసలు దాని గురించి చర్చించం. ఎప్పుడైనా సరే మ్యాచ్‌కు రెండు రోజుల ముందే వేదిక వద్దకు వెళ్తాం. తక్కువ వ్యవధిలో మేం చేసేదేముంటుంది? పిచ్‌ను ఎలా తయారు చేయాలనేది క్యూరేటర్ నిర్ణయిస్తాడు. ఎలాంటి మైదానంలోనైనా గెలవగల సత్తా మాకుంది. దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో మేం విజయం సాధించాం. ఆ పిచ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

ఇంగ్లాండ్‌తో గత మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లు ఎదుర్కొన్నాం. హైదరాబాద్‌ పిచ్‌ చాలా మందకొడిగా ఉంది. స్పిన్‌ అయినప్పటికీ బంతి చాలా స్లోగా వచ్చింది. వైజాగ్‌లోనూ మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ నెమ్మదిగా మారిపోయింది. రాజ్‌కోట్‌లో నాలుగో రోజు మాత్రం బంతి విపరీతంగా టర్న్‌ అయింది. భారత్‌లో ఇలాంటి పరిస్థితులు మామూలే. విదేశాల్లోనూ ఇలాంటి పిచ్‌లు ఉంటే అక్కడా నాణ్యమైన ప్రదర్శన చేస్తాం. మూడో టెస్టులో మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. సొంత మైదానంలో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. సర్ఫరాజ్‌ ఖాన్ గురించి అంతకుముందు విన్నా. అతడి బ్యాటింగ్‌ను ఎక్కువగా చూడలేదు. పరుగుల ఆకలితో ఉన్నట్లుగా గత నాలుగైదేళ్ల నుంచి దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. జట్టులోకి తీసుకున్నాక.. అతడి గురించి ఎక్కువగా చర్చించలేదు. అలా చేస్తే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అతడి సహజ ఆటతీరును ఆడించాం‘’ అని రోహిత్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని